Minister Kodali Nani On OTS Scheme:ముఖ్యమంత్రి జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో రేపటి నుంచి వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకం అమలు చేయనున్నట్లు పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. గృహ నిర్మాణశాఖ నుంచి రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఓటీఎస్ పథకం ద్వారా హక్కు కల్పిస్తామని తెలిపారు. హక్కు లేక రూ. 15-20 లక్షల విలువైన ఇళ్లను రూ. 2-3 లక్షలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
తక్కువ ధరకే ఇళ్లు అమ్ముకునే పరిస్థితి నుంచి ఓటీఎస్ తప్పిస్తుందన్నారు. లబ్ధిదారులకు ఎంత రుణం ఉన్నా.. ఓటీఎస్ ద్వారా రూపాయి తీసుకుకోకుండా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేస్తుందని తెలిపారు. ఈ పథకం ద్వారా 5 లక్షల మంది పేదలకు ప్రయోజనం చేకూరనుందని స్పష్టం చేశారు.
పేద ప్రజల సంక్షేమం కోసం తీసుకొచ్చిన ఈ పథకాన్ని ప్రతిపక్ష నేతలు పనిగట్టుకొని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పేదలకు నష్టం చేకూర్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జగనన్న పాలవెల్లువ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులకు అమూల్ అదనంగా రూ.7 చెల్లిస్తోందని మంత్రి తెలిపారు.