కరోనా లాక్‌డౌన్ పరిణామాలతో...రాష్ట్రంలో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, రవాణాకు కష్టకాలం ఎదురైంది. ముఖ్యంగా ధాన్యం చేతికందే వేళ...కొనుగోళ్లు, రవాణాలో తలెత్తుతున్నఇబ్బందుల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిసారిచింది. రాష్ట్రవ్యాప్తంగా... 1280 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. గ్రామ సచివాలయాల సమన్వయంతో ఇవి పనిచేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 10న పశ్చిమగోదావరి జిల్లా నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ సీజన్‌లో 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం... అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సిందిగా జిల్లాస్థాయి అధికారులను ఆదేశిచింది.
లాక్ డౌన్ నేపథ్యంలో... రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని పౌరసరఫరాల శాఖకు సూచించింది. తూర్పుగోదావరి... కృష్ణా జిల్లాల్లో కోతల సమయాన్ని బట్టి కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించుకునే వెసులుబాటు కల్పించింది. 75 రోజుల వరకూ ఈ కేంద్రాలు తెరిచే ఉంటాయని... వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో 16, నెల్లూరులో 179, పశ్చిమగోదావరి జిల్లాలో 65 కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.