రాష్ట్రంలో ఈ క్రాప్(e-crop) సహా సీఎం ఆప్ లను మరింత సరళీకృతం చేసి రైతులకు సులువుగా ఉండేలా చేస్తామని మంత్రి కన్నబాబు(minister kannababu) తెలిపారు. సాగు చేసే ప్రతి పంట ఈ క్రాప్‌లో రిజిస్టర్ చేయించాలని ఆయన సూచించారు. రైతుతో పాటూ మనందరి ప్రధాన బాధ్యతని, అందుకు తగిన సదుపాయాలను ఆర్బీకే(rbk)ల్లో కల్పించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యవసాయ సలహా మండళ్ల చైర్మన్లతో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులో కన్నబాబు పాల్గొన్నారు.
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వ్యవసాయ మండళ్లను అన్ని వ్యవసాయ అంశాల్లోనూ భాగస్వాములను చేస్తున్నామన్నారు. రైతుకు సముచిత గౌరవం ఇస్తూ.. రైతులనే చైర్మన్లుగా నియమించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.
వ్యవసాయ సలహా మండళ్ల ఆవిర్భావం, ఉద్దేశాలు, బాధ్యతలు తదితర అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులు అవగాహన కల్పిస్తున్నారన్నారు. వ్యవసాయ సేవలను రైతులకు మరింత చేరువుగా, మెరుగ్గా అందాలనే సదుద్దేశంతో సీఎం వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. సుమారు లక్ష మందికి పైగా అనుభవమున్న రైతులు.. వ్యవసాయంపై, ఈ మండళ్ల ద్వారా ప్రభుత్వానికి విలువైన సలహాలు ఇస్తారన్నారు.