అమరావతి ఉద్యమం అంతా చంద్రబాబు సహా కొందరి స్వార్థం కోసం జరుగుతున్న ఉద్యమం అని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆరోపించారు. ఒకరి స్వార్థం కోసం ఉద్యమం చేస్తే దాన్ని డ్రామా అంటారన్నారు. అమరావతి ఉద్యమం 600 రోజులు అయిందని తెదేపా పండుగ చేసుకుంటోందన్న మంత్రి.. ఆ ఉద్యమం ఎలా జరుగుతోందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ 3 రాజధానులు ప్రకటించారన్నారు. గుంటూరు, విజయవాడ స్థానిక ఎన్నికల్లో ప్రజల తీర్పుతో అయినా చంద్రబాబుకి వాస్తవాలు అర్థం కావడం లేదని విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను... రాజధానికి రెఫరెండంగా ఎందుకు తీసుకోవడం లేదని కన్నబాబు తెదేపా నేతలను ప్రశ్నించారు. ర్యాలీలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందని.. అయినా హైకోర్టు వరకు ర్యాలీగా వెళ్లారని.. ఒకవేళ కోర్టుపై దాడి జరిగితే ప్రభుత్వాన్ని ప్రశ్నించరా.. అనీ నిలదీశారు. అమరావతి అభివృద్ధి సైతం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతేనన్న మంత్రి.. ఇక్కడ శాసన రాజధాని ఉంటే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. 3 రాజధానులు వచ్చి తీరుతాయని స్పష్టం చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభమవుతుందని కన్నబాబు తేల్చి చెప్పారు.