కేంద్ర ప్రాయోజిత పథకాలను వినియోగించుకుని రైతులకు మేలు చేసేలా ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి కె.కన్నబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలకు సంబంధించిన కేంద్ర ప్రాయోజిత పథకాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో కేంద్ర ప్రాయోజిత పథకాల సమన్వయంపై పలు సూచనలు చేశారు. ఖర్చు చేసే ప్రతి రూపాయిపైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రతా మిషన్, జాతీయ వ్యవసాయ స్వావలంబన , ప్రధాన మంత్రి కృషి సీంచాయీ యోజన అమలు తీరుపై అధికారులతో చర్చించారు. గ్రామాల్లో రైతులకు రసాయనాలు, పురుగు మందుల వినియోగం తగ్గించేలా అవగాహన పెంచాలన్నారు. వ్యవసాయ , ఉద్యానశాఖలు ,విశ్వవిద్యాలయాలతో సమన్వయం చేసుకొని రైతాంగానికి శాస్త్రీయ వ్యవసాయ యాజమాన్య పద్ధతులు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.