AP bifurcation act Guarantees: కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌తో దిల్లీలో రాష్ట్రానికి సంబంధించిన 11 అంశాలపై చర్చించినట్లు వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత, దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వి.విజయసాయిరెడ్డి తెలిపారు. సమావేశానంతరం రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో కలిసి విలేకర్లతో ఆయన మాట్లాడారు. ‘గతంలో ప్రధాని మోదీ దృష్టికి సీఎం జగన్ తీసుకొచ్చిన అంశాలపై ఆర్థికశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో గతంలో సమావేశం జరిగింది. దానికి కొనసాగింపుగా గురువారం 2.45 గంటలపాటు వివిధ అంశాలపై చర్చించాం. వాటిలో ప్రధానంగా.. 14వ ఆర్థికసంఘం కాలంలో చంద్రబాబు హయాంలో అప్పటి ప్రభుత్వం తీసుకున్న అధిక అప్పుల క్రమబద్ధీకరణ, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ.6,600 కోట్ల విద్యుత్తు బకాయిలు, రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు, భోగాపురం ఎయిర్‌పోర్టు, విభజన సమయంలో జాతీయ ఆహారభద్రత చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం, ఉమ్మడి రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ చేసిన అప్పుల్లో తెలంగాణకు వాటా బదిలీ, కడప స్టీల్‌ప్లాంట్‌కు గనుల కేటాయింపు, బీచ్‌శాండ్ మినరల్ కేటాయింపులో నిబంధనల సడలింపు, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 12 కొత్త జిల్లాలకు వైద్య కళాశాలల కేటాయింపు, వివిధ షెడ్యూల్డ్ బ్యాంకుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రుణ ప్రతిపాదనల క్లియరెన్స్‌లపై చర్చించాం. రెవెన్యూలోటు భర్తీపై చాలా సానుకూలంగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టు అంశమూ పాజిటివ్‌గా ముందుకెళ్తోంది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు వారంలో ఎన్‌ఓసీ వస్తుంది. బీచ్‌శాండ్ మినరల్స్ కేటాయింపు కోసం కేంద్రం ఒక్కో ప్రాజెక్టుకు 1,000 హెక్టార్ల పరిమితి విధించింది. ఆ పరిమితిని పెంచితేనే మంచి పరిశ్రమలు వస్తాయని చెప్పాం. ఆర్థికశాఖ కార్యదర్శి దీనిపై సానుకూలంగా స్పందించారు’ అని వివరించారు.
పోలవరం ఆలస్యానికి తెదేపా ప్రభుత్వమే కారణం: బుగ్గన
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యానికి గత తెలుగుదేశం ప్రభుత్వ వైఖరే కారణమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. ‘2017లో వారు ఎలాంటి అవగాహన లేకుండా 2013-14 రేట్ల ప్రకారం మాకు నిధులిస్తే చాలని అవివేకంతో కూడిన నిర్ణయం తీసుకున్నారు. ఒక ప్రాజెక్టు నిర్మాణానికి సంవత్సరాలు పడుతుంది. కానీ... ఏదో ఒక సంవత్సరానికి సంబంధించిన రేట్లకు కట్టుబడితే ప్రాజెక్టు ముందుకెలా వెళ్తుంది? దాన్ని సరిదిద్దేందుకు ఇంత సమయం పట్టింది. విజసాయిరెడ్డి చెప్పినవన్నీ రాష్ట్ర పునర్వ్వస్థీకరణకు సంబంధించిన అంశాలు. తొలి రెండేళ్లలోనే పూర్తికావాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వం పక్క రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి ప్రయత్నించి, భంగపడి విజయవాడకు పారిపోయి వచ్చింది.