విజయవాడలోని ఏఎంఆర్‌డీ కార్యాలయం నుంచి మంగళవారం మంత్రి బొత్స సత్యనారాయణ పుర, నగరపాలక సంస్థల కమిషనర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో 365 చదరపు అడుగుల ఇంటికి లబ్ధిదారుల వాటా రూ.50 వేలు, 430 చదరపు అడుగుల ఇంటికి రూ.లక్ష చెల్లించాలని నిర్దేశించారని మంత్రి అన్నారు. తమ ప్రభుత్వం లబ్ధిదారుల వాటాలో 50 శాతం రాయితీ ఇచ్చి మిగతా 50 శాతం చెల్లిస్తే చాలని నిర్ణయించిందని తెలిపారు.
ఈ విషయాన్ని లబ్ధిదారులకు వివరించాలని అధికారులకు ఆయన సూచించారు. ఇళ్ల పంపిణీ సందర్భంగా లబ్ధిదారులు తీసుకురావలసిన ధ్రువపత్రాలపై అవగాహన కల్పించాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఆయా పత్రాలు తిరిగి లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు. ఇళ్ల కేటాయింపు, స్థలాల పంపిణీ కోసం కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.