Minister Botsa Satyanarayana on Schools Merge:రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలనేదే తమ ప్రభుత్వ విధానమని.. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉపాధ్యాయులంతా అందుకు అనుగుణంగా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. పాఠశాలల విలీనం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సంబంధించి జీవో 117లో కొన్ని సవరణలను వివిధ సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్సీలు సూచించారని.. వాటిని పరిశీలిస్తామన్నారు. అందుకు అనుగుణంగా సవరించిన మార్పులతో తాజా ఉత్తర్వులను విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. విజయవాడలోని మంత్రి బొత్స క్యాంపు కార్యాలయంలో గుర్తింపు పొందిన అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జీవో 117 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఫ్యాప్టో ఆధ్వర్యంలో రేపు అన్ని మండల కేంద్రాల్లోనూ, డీఈఓ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మంత్రి బొత్స చర్చలకు ఆహ్వానించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
విద్యా సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందని.. పాఠశాలలను విభజన చేయడం అనేది ఎక్కడా లేదని ఫ్యాప్టో ఆధ్వర్యంలోని సంఘాలు నేతలు అన్నారు. జీవో 117 కారణంగా ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారంటూ వారి ఆవేదనను వ్యక్తం చేశారు. వేలాది పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారి ప్రాథమిక విద్య నాశనం అవుతుందని ఆందోళన చెందారు. ఆంగ్ల మాద్యమంతోపాటు తెలుగు బోధననూ సమాంతరంగా కొనసాగించాలని కోరారు.
ఫ్యాప్టోతోపాటు అన్ని గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలను కూడా మంత్రి బొత్స చర్చలకు ఆహ్వానించిన తరుణంలో అందరి అభిప్రాయాలపైనా కూలంకుషంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు, విధాన నిర్ణయాలను మంత్రి బొత్స స్పష్టంగా తెలియజేశారు. ఆంగ్ల మాధ్యమం, పాఠశాలల విలీనం విషయంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.