పదో తరగతి పరీక్షా పత్రాలు లీక్ కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విద్యార్ధులు ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాయటంపైనే దృష్టి సారించాలని ఆయన సూచించారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని.., స్వార్ధ ప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి అరెస్టు చేశామని మంత్రి తెలిపారు.
చిత్తూరులో ఓ ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బంది సహా మాల్ ప్రాక్టీసు చేసేందుకు ప్రయత్నించిన ఏడుగురిని, మరింకొందరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. ఆరు లక్షల మంది విద్యార్ధుల భవితకు సంబంధించిన అంశాలపై రాజకీయాలు చేయెద్దని మంత్రి హితవు పలికారు. సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారాన్ని పట్టించుకోవద్దని విద్యార్ధులకు, తల్లితండ్రులకూ సూచిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.