పదో తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎక్కడా మాస్ కాపీయింగ్, పేపర్ లీక్ అనేది జరగలేదని చెప్పారు. అదే సమయంలో.. ప్రశ్నాపత్రాల విషయంలో మాత్రం 60 మందిపై కేసులు నమోదు చేశామని ప్రకటించడం విశేషం. 38 మంది ప్రభుత్వ, 22 మంది ప్రైవేటు సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా క్రిమినల్ కేసు పెట్టామన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బంది ప్రమేయంపైనా విచారణ జరుగుతోందని తెలిపారు.
ఈ విషయంలో.. కొన్ని పార్టీలు ప్రభుత్వంపై కావాలనే బురద జల్లాలని చూస్తున్నాయని మంత్రి బొత్స మండిపడ్డారు. అక్రమార్కులను ప్రోత్సహించేలా ప్రతిపక్ష నేతల వైఖరి ఉందన్నారు. మేం తప్పు చేస్తే ఉపాధ్యాయ సంఘాలు ఊరుకుంటాయా? అని ప్రశ్నించారు. తప్పు చేసినవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సీఎం జగన్ విద్య, వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
టెన్త్లో ఫెయిల్..ఇంటర్లోనైనా పాసవ్వండి: పదో తరగతి పరీక్షల నిర్వహణలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెదేపా నేత నారా లోకేశ్ విమర్శించారు. రోజుకో చోట ప్రశ్నాపత్రం లీకేజ్ జరుగుతోందని.. ప్రశ్నాప్రత్రాలు వైకాపా నేతల వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్నాయని ఆరోపించారు. లీకేజ్ ఘటనలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన పదవి నుంచి తప్పుకోలన్నారు. పది పరీక్షల నిర్వహణలో విఫలమైన ప్రభుత్వం.. కనీసం ఇంటర్ పరీక్షలనైనా పకడ్బందీగా నిర్వహించాలని లోకేశ్ హితవు పలికారు.