ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తప్పు చేస్తే ఎవరినీ వదలం.. చేయలేదని నిరూపించుకోగలరా? : మంత్రి బొత్స - మంత్రి బొత్స తాజా వార్తలు

పదో తరగతి పేపర్‌ను వాట్సాప్‌లో పంపి మాస్ కాపీయింగ్‌కు యత్నించారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సచివాలయంలో సీఎం జగన్​ను కలిసిన మంత్రి బొత్స.. పదోతరగతి పేపర్‌ లీకేజీ కేసులో నారాయణ అరెస్టు, ఇతర అంశాలపై చర్చించారు. మాస్ కాపీయింగ్‌లో నారాయణ కాలేజ్‌ వైస్ ప్రిన్సిపల్ కూడా ఉన్నారని మంత్రి వెల్లడించారు.

తప్పు చేస్తే ఎవరినీ వదలం
తప్పు చేస్తే ఎవరినీ వదలం

By

Published : May 10, 2022, 3:31 PM IST

Updated : May 10, 2022, 5:51 PM IST

పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రమేయం ఉన్నవారందరినీ అరెస్టు చేసినట్లు.. మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పేపర్‌ లీకేజీ ఘటనపై 60 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. తప్పు చేస్తే ఎవరినీ వదిలేది లేదన్న ఆయన.. తప్పు చేయలేదని ఎవరైనా నిరూపించుకోగలరా? అని ప్రశ్నించారు. సచివాలయంలో సీఎం జగన్​ను కలిసిన మంత్రి బొత్స.. పదోతరగతి పేపర్‌ లీకేజీ కేసులో నారాయణ అరెస్టు, ఇతర అంశాలపై చర్చించారు. పదో తరగతి పేపర్‌ను వాట్సాప్‌లో పంపి మాస్ కాపీయింగ్‌కు యత్నించారని అన్నారు. మాస్ కాపీయింగ్‌లో నారాయణ కాలేజ్‌ వైస్ ప్రిన్సిపల్ కూడా ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారని మంత్రి బొత్స వెల్లడించారు.

తప్పు చేస్తే ఎవరినీ వదలం

"బోధన, బోధనేతర సిబ్బంది కాపీయింగ్‌ చేయించేందుకు ప్రయత్నం. ఇప్పటివరకు 60 మందిని అరెస్టు చేశాం. 38 మంది ప్రభుత్వ, 22 మంది ప్రైవేట్‌ టీచర్లు అరెస్టు. లీకేజ్‌ కేసులో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తప్పు చేస్తే ఎవరినైనా పోలీసులు అరెస్టు చేస్తారు. అమరావతి రింగ్‌రోడ్‌లో అక్రమాలు లేకుంటే కేసు ఎందుకు పెడతారు ?. రింగ్‌రోడ్‌ కేసులో నారాయణను అరెస్టు చేశారా అనేది నాకు తెలియదు." - బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి

నారాయణను అరెస్టు చేస్తే తప్పేంటి ?: నారాయణ విద్యను వ్యాపారం చేస్తోన్న బిజినెస్​మెన్ అని మంత్రి అంబటి ఆరోపించారు. పేపర్ లీకేజీ స్కాంలో ఆయన ఉన్నారని ప్రాథమికంగా ఆధారాలు ఉన్నందునే అరెస్టు చేశారన్నారు. పేపర్లు లీక్ చేయటం వల్లే నారాయణ నెంబర్ వన్​గా నిలుస్తోందని ఆరోపించారు. పేపర్ లీక్ చేసిన నారాయణను అరెస్టు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు.

నారాయణ అరెస్టు:మాజీమంత్రి నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. తొలుత తెలంగాణ రాజధాని హైదారాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత అరెస్టు చేసినట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారంలో ఆయన్ను అరెస్టు చేసినట్టు ప్రకటించారు. హైదరాబాద్‌లో కారులో వెళ్తున్న నారాయణ దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి సొంత కారులోనే ఏపీకి తరలించారు.

నారాయణపై పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ మాల్ ప్రాక్టీస్ చట్టం, సెక్షన్‌ 5, 8, 10 ఏపీ పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ చట్టంతో పాటు 408, 409, 201, 120 (బి), 65 ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. చిత్తూరు జ్యుడీషియల్ కోర్టులో పోలీసులు నారాయణను హాజరుపరచనున్నారు. అనంతరం ఆయన్ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించనున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా పదోతరగతి ప్రశ్నాపత్రాలు వరుసగా లీకేజీకావడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. తొలుత విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ అసలు ప్రశ్నాపత్రాలే లీకవ్వలేదంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యనించారు. ఇదంతా తెలుగుదేశం చేస్తున్న విషప్రచారమంటూ మండిపడ్డారు. ఆ తర్వాత సీఎం జగన్ తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో నారాయణ, చైతన్య విద్యాసంస్థల్లోనే ప్రశ్నాపత్రాలు లీకైనట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నారాయణను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయితే పేపర్‌ లీకేజీ, మాల్‌ ప్రాక్టీస్‌ కేసులో దాదాపు 50 మందికి పైగానే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం విశేషం. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి చిత్తూరు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదైంది. ఈ కేసులో నారాయణ స్కూలు వైస్‌ ప్రిన్సిపల్ గిరిధర్‌తోపాటు పలువురిని అరెస్ట్‌ చేశారు.

ఇవీ చూడండి :

Last Updated : May 10, 2022, 5:51 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details