అమెరికా వెళ్తా అనగానే డబ్బులు ఇస్తే ఎలా అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విదేశీ ఉన్నత విద్య పథకాన్నినిలుపుదల చేశారన్న విపక్షాల విమర్శలను బొత్స తప్పుపట్టారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాల మూసేశారంటే విద్యాశాఖ మంత్రిగా దానికి బాధ్యత వహిస్తానన్నారు. ఎక్కడా పాఠశాలలు మూసివేయలేదని చెప్పారు. పాఠశాలల్లో తరగతుల విలీనంపై దాదాపు 270 అభ్యంతరాలు వచ్చాయని వాటిని పరిశీలిస్తామని చెప్పారు.
విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో వర్షాలపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడిన ఆయన.. 3,4,5 తరగతులను తరలించిన తర్వాత ఆ పాఠశాలల్లో 1,2 తరగతులతో పాటూ ఫౌండేషన్ స్కూల్ తీసుకొస్తామని తెలిపారు. ఉపాధ్యాయుల వినతులను పరిగణలోకి తీసుకుని జీవో 117కు సవరణ చేశామన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఒక తరగతిలో విద్యార్థుల సంఖ్య 21 దాటితే మరొక ఎస్జీటీ ఉపాధ్యాయుడిని నియమిస్తామని చెప్పారు. ఉన్నత పాఠశాలల్లో 150 మంది విద్యార్థులు సంఖ్య దాటితే ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.