రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాజెక్టులపై ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలోనూ రెండో విడత అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కావటంతో పాటు.. ఆంక్షలు ఎత్తివేస్తుండటంతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రాజెక్టులను ప్రారంభించాల్సిందిగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోనూ రెండో విడత అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైనందున రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలన్నీ రేపటినుంచి ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను చాటి చేప్పే విధంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రోడ్ షోలు నిర్వహించాల్సిందిగా సూచనలు ఇచ్చారు. విశాఖపట్నం ఋషికొండలోని పర్యాటకశాఖ బ్లూబే హోటల్‌ను రూ.164 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఈ నెల 24 తేదీన బోటు ఆపరేటర్లతోనూ సమావేశం కావాలని పర్యాటకశాఖ నిర్ణయించింది. వివిధ చోట్ల బోట్ ఆపరేషన్లను కూడా మొదలుపెడతామని మంత్రి వెల్లడించారు. బోటు ప్రమాదాలు జరగకుండా కమాండ్ కంట్రోల్ ద్వారా నియంత్రిస్తామని మంత్రి తెలిపారు. ఈ అంశంపై రేపు బోటు ఆపరేటర్లతో విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
కొవిడ్ కారణంగా పర్యాటకపరమైన ఆదాయం నిలిచిపోయినప్పటికీ కోవిడ్ కేర్ కేంద్రాలకు ఆహార సరఫరా ద్వారా ఏపీటీడీసీ ఈ ఏడాది రూ.28 కోట్లను ఆర్జించిందన్నారు. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి తీరానికి కొట్టుకు వచ్చిన ఓడను ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా మార్చేందుకు అనుమతులు తీసుకున్నామని త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం మద్య పానానికి వ్యతిరేకమైన పర్యాటక ప్రాంతాలకు విదేశీయులను ఆకర్షించేందుకు వీలుగా ఖరీదైన మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచేందుకు 33 బార్లకు అనుమతిచ్చినట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 7 ఫైవ్ స్టార్ హోటళ్లను ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.