Ambati Rambabu: భారీ వరదలు వచ్చినా.. ఒక్క ప్రాణం కూడా పోకుండా గోదావరి వరదల్లో అధికారులు సహాయక కార్యక్రమాలు సమర్ధంగా చేపట్టారని.. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అధికారులు, వాలంటీర్ల సహాకారంతో.. సహాయక చర్యలు చేపట్టామని, పునరావాస చర్యలు విషయంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. 28లక్షల క్యూసెక్కుల వరద లక్ష్యంతో గతంలో కాఫర్ డ్యాం ను నిర్మించగా.. పోలవరం వద్ద 27 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించడంతో తామంతా భయపడ్డామని, 30 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా డ్యాం దెబ్బకుండా ఉండేలా యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఎత్తు పెంచాం..పోలవరం ప్రాజెక్టు దెబ్బతినకుండా కాఫర్ డ్యాం ఎత్తు మరో మీటర్ పెంచామన్నారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా.. తెదేపా నేతలు సహా కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తూ రెచ్చగొడుతున్నారన్నారు. ఆరుగురు కలెక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటూ.. సహాయక చర్యలను చేపట్టారని, గోదావరి వరదల్లో రాజకీయం చేస్తే ప్రయోజనం ఉండదని చంద్రబాబుకు సూచించారు.
దేవినేనిపై మండిపాటు.. తనపై దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామని దేవినేని ఉమా గతంలో ప్రకటించగా.. గడువు నాటికి ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. పోలవరం నిర్మాణం పూర్తి చేసేందుకు అహర్నిశలు చిత్తశుద్దితో పని చేస్తున్నామన్నారు.