Polavaram.. పోలవరం దిగువ కాఫర్ డ్యామ్‌పై పీపీఏ లేఖ వాస్తవమేనని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. దిగువ కాఫర్ డ్యామ్‌పై ప్రభుత్వం త్వరలో వివరణ ఇస్తుందన్నారు. సీజన్ కంటే ముందే ఆకస్మికంగా వరదలు వచ్చి పనులు ఆగాయని తెలిపారు. వరదల వల్లే జులై 31లోగా పనులు పూర్తి చేయలేకపోయామని చెప్పారు. కేంద్ర జలసంఘం, పీపీఏ, రాష్ట్రప్రభుత్వం మధ్య లేఖలు మామూలేనని అంబటి అన్నారు. డయాఫ్రం వాల్ ఎంత దెబ్బతిందనేది అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.
మళ్లీ వరద ముప్పు:గోదావరికి మళ్లీ వరద ముప్పు పొంచి ఉందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గోదావరిలో ప్రస్తుతం 10.27 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉందన్నారు. పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోనూ వరదలు వచ్చే ప్రమాదని చెప్పారు. జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు నిండాయని..,పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ నుంచి నీరు విడుదల చేస్తున్నామన్నారు. కృష్ణా డెల్టాలో వరద ప్రవాహాలు వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.