తమ ప్రభుత్వం వచ్చాకే పోలవరం స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ పూర్తిచేశామని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మంత్రిగా సాంకేతిక అంశాలు తెలియాల్సిన అవసరం లేదని చెప్పారు. సాంకేతిక అంశాలు తెలియకపోయినా తనకు కామన్ సెన్స్ ఉందని అంబటి వ్యాఖ్యానించారు. దేశంలో ఆరోగ్యశాఖల మంత్రులు ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తారా ? అని ఆయన ప్రశ్నించారు. పోలవరం ఎత్తుతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదన్నారు. ముంపు ప్రాంతాలను ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలిపారని.. ఈ విషయాన్ని తెలంగాణ నేతలు గుర్తించాలని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కేంద్రం చెప్పిందన్నారు. అయితే దీనిలో తెదేపా ఐదేళ్లు, వైకాపా మూడేళ్లు అధికారంలో ఉన్నాయన్నారు. ఎక్కువ సమయం ఎవరు అధికారంలో ఉన్నారని మంత్రి ప్రశ్నించారు. కొత్త డీపీఆర్ ఆమోదం అంశం కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా రూ.2,700 కోట్లు ఏపీకి రావాల్సి ఉందన్నారు.