MEGA FANS MEETING: జనసేనను జనంలోకి తీసుకెళ్లేలా తమ వంతు కృషి చేస్తామని.. అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు స్పష్టంచేశారు. విజయవాడలోని మురళి ఫార్చున్ హోటల్లో నిర్వహించిన పవన్, చిరు, రామ్‌చరణ్ అభిమాన సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెగా అభిమానులు పవన్ కల్యాణ్‌తో నడుస్తారని చెప్పారు. 2024లో పవన్ కల్యాణ్‌ను సీఎం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
మరికొన్ని సమావేశాల అనంతరం.. జనసేన అధికారంలోకి వచ్చేలా ప్రణాళిక బద్ధంగా పని చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. అభిమానులకు, నాయకులకు మధ్య అంతరాలు లేవని, పార్టీ ఆదేశాలను పాటిస్తూ ముందుకు వెళతామని, మెగా అభిమానులు అందరూ జనసేన కార్యకర్తలుగా పని చేస్తారని పేర్కొన్నారు. పొత్తుల అంశం తమ పరిధి కాదని, పెద్దలు నిర్ణయిస్తారని వివరించారు. గతంలో ప్రజారాజ్యం పార్టీపై అనేక కుట్రలు చేశారని, అయినా.. కుటుంబాలు వదిలి ఆనాడు చిరంజీవి కోసం పని చేశామని స్వామినాయుడు తెలిపారు.