Medical Employee Unions On PRC: పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెలో తాము పాల్గొంటామని వైద్యారోగ్యశాఖ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. విజయవాడలో సమావేశమైన వైద్యారోగ్యశాఖలోని ఉద్యోగ సంఘాల నాయకులు.. ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చామని ప్రకటించారు. అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా ఉద్యమంలో పాల్గొంటామని నేతలు తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన నూతన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామన్నారు. వైద్య సిబ్బంది సమ్మెకు దిగితే తలెత్తబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉద్యోగ సంఘాల నాయకులు తేల్చిచెప్పారు.
లిఖితపూర్వక ఆహ్వానం వస్తేనే చర్చలకు వెళ్తాం..
Employee union Leaders on PRC: ప్రభుత్వం చర్చల పేరిట ఉద్యోగులను పక్కదోవ పట్టించిందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నమ్మి ఉద్యోగ, ఉపాధ్యాయులు మోసపోయారన్నారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ఎందుకు బహిర్గతం చేయట్లేదని ప్రశ్నించారు. నివేదికలో ఉన్న రహస్యమేంటో తెలపాలన్నారు. కొత్త పీఆర్సీ వల్ల రూ.10,600 కోట్లు ఖర్చవుతుందని.. పాత జీతాలే ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి..
ఇకనుంచి లిఖితపూర్వక ఆహ్వానం వస్తేనే చర్చలకు వెళ్తామని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. వచ్చే నెల 3న చలో విజయవాడ కార్యక్రమంతో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. ఆ కార్యక్రమానికి ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది, పింఛనర్లు అందరూ తరలిరావాలని కోరారు. ప్రభుత్వం చేసిన కుట్రలను గమనించి ఉద్యోగుల ఐక్యతను ప్రభుత్వానికి చూపించాలన్నారు. న్యాయ సలహాలు ఇచ్చేందుకు సాధన సమితి పక్షాన ఇద్దరు న్యాయవాదులు రవిప్రసాద్, సత్యప్రసాద్‌లను నియమించుకున్నట్లు వెల్లడించారు.