MANGO TREES CUTTING: పండ్లలో రారాజు అదే. బంగారం రంగులో నోరూరించే తీపితో... ప్రత్యేకంగా నిలిచే పండు. అందరూ ఇష్టపడే అమృతం లాంటి ఫలం మామిడి. ఈ పళ్లను పండించే ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది నూజివీడు. ఈ ఊరి పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది రుచికరమైన మామిడి పండ్లే. అద్భుతమైన రుచులతో కూడిన మామిడిని అందిస్తూ.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రాంతమిది. అయితే.. ఇక్కడ మామిడికి కాలం చెల్లిందంటున్నారు నూజివీడు రైతులు. ఎన్నో ఏళ్లుగా ఉద్యానవన పంటగా మామిడిని సాగు చేస్తున్న రైతులు.. ప్రస్తుతం పెద్ద చెట్లను తొలగిస్తున్నారు.
చెట్ల వయసు ఎక్కువ కావడం వల్ల దిగుబడి తగ్గడం.. పండ్ల కోత కష్టాలు.. వంటివి చెట్ల కొట్టివేతకు కారణాలుగా చెబుతున్నారు రైతులు. నష్టమేనని తెలిసినా.. తప్పని పరిస్థితుల్లో కొన్నింటిని తొలగించి.. ఆ స్థానంలో మళ్లీ కొత్తగా నాటుతామని చెబుతున్నారు.