కృష్ణాజిల్లా మండవల్లి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన నకిలీ చలనాల వ్యవహారంలో ప్రధాన నిందితుడైన స్టాంపు వెండర్ ధీరజ్‌ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు. కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. 640 నకిలీ చలానాలలో 450 చలానాలకు సంబంధించి రూ.1.02కోట్లను ప్రభుత్వ ఖజానాలో జమ చేయించామని తెలిపారు. నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ వెల్లడించారు. ఈ వ్యవహారంలో బాధ్యులను గుర్తించి, చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఏం జరిగిందంటే...
కృష్ణా జిల్లా మండవల్లి సబ్ రిజస్ట్రార్ కార్యాలయంలో ఒకే ఒక్క డాక్యుమెంట్ రైటర్ ఉన్నారు. ఆయనే స్థిరాస్తి లావాదేవీలు చూస్తారు. అందరూ ఆయన దగ్గరే దస్తావేజులు రాయించుకుంటారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ పరిచయాలతో పనులు చేయిస్తుంటారు. మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చాలా తక్కువ రిజిస్ట్రేషన్‌లు జరుగుతుంటాయి. ఏడాదికి ఇక్కడ ఆదాయమే రూ.9 కోట్లు ఉంటుంది. అలాంటిది ఒకే ఏడాది డాక్యుమెంటు రైటర్ ప్రభుత్వ ఆదాయానికి రూ.2.5కోట్లు గండి కొట్టారు. ప్రస్తుతం వసూలుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీనికి తోడు 258 మంది క్రయదారులు డాక్యుమెంట్ రైటర్ చుట్టూ తిరుగుతున్నారు. వీరందరికి నోటీసులు జారీ అయ్యాయి.