Mallikarjuna Kharge: కాంగ్రెస్ అధ్యక్షునిగా పోటీ చేసే అరుదైన అవకాశం తనకు వచ్చిందని ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ వచ్చిన ఆయన, తన రాజకీయ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. తాను ఇప్పటికే పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నానని, సుదీర్ఘ కాలంపాటు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. 2009లో సోనియా గాంధీ సూచనల మేరకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశానన్నారు. కేంద్ర కార్మిక శాఖ, సోషల్ జస్టిస్ మంత్రిగా దేశానికి, పార్టీకి సేవ చేశానని ఖర్గే వివరించారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఏఐసీసీ అధ్యక్షులుగా ఉండటానికి నిరాకరించడంతోనే ఈ ఎన్నిక అనివార్యమైందని ఖర్గే తెలిపారు.
అధ్యక్ష స్థానంలో గాంధీ కుటుంబ వ్యక్తులు లేకపోవడం బాధాకరమని మల్లిఖార్జున ఖర్గే వాపోయారు. అందరి సూచనల మేరకు అధ్యక్ష స్థానానికి అభ్యర్థిగా నిలిచానని, ఏపీ నుంచి వచ్చిన నేతలు దేశానికి నిర్దేశం చేశారని గుర్తుచేశారు. భాజపా, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడే బలం తనకివ్వాలని పార్టీ నేతలను కోరారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైతే ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేస్తానని, వచ్చే ఎన్నికల్లో 50 శాతం సీట్లను 50 ఏళ్ల వయసులోపు వారికే కేటాయిస్తామని పేర్కొన్నారు. ఇందిరా, రాజీవ్‌గాంధీ వంటివారు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని.. అలాంటి పార్టీ అధ్యక్ష రేసులో తాను ఉండటం అదృష్టమని ఖర్గే తెలిపారు.