తెలుగుదేశం పసుపు పండుగ మహానాడు తొలి రోజు వేడుక అట్టహాసంగా ముగిసింది. మొత్తం 8 తీర్మానాలకు ఇందులో ఆమోదం తెలిపారు. జూమ్ యాప్ ద్వారా 14వేల మంది వర్చువల్‌గా ఈ వేడుకలో పాల్గొనగా ఫేస్బుక్, యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వేలాది మంది కార్యక్రమాన్ని వీక్షించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దాదాపు 6 గంటల పాటు సాగిన తొలిరోజు కార్యక్రమంలో రెండు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై ఆరు తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపు, మాట తప్పిన జగన్, కరోనా, వలస కార్మికుల అవస్థలు, తితిదే భూముల వ్యవహారం, అరాచక పాలనకు ఏడాది... ప్రమాదంలో ప్రజాస్వామ్యం, అన్నదాత వెన్ను విరిచిన జగన్., సంక్షోభంలో సాగునీటి ప్రాజెక్టులు తదితర తీర్మానాలపై సుదీర్ఘంగా చర్చించిన మహానాడు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టింది. సమయాభావం వల్ల తొలి రోజు చర్చించాల్సిన మరో మూడు తీర్మానాలను నేటికి వాయిదా వేశారు.
విద్యుత్ ఛార్జీల పెంపుపై తీర్మానాన్ని ఎంపీ కేశినేని ప్రవేశపెట్టగా దాన్ని పార్టీ నేత బి.టి.నాయుడు బలపరిచారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై జగన్ మాటతప్పి మొత్తం వ్యవస్థనే భ్రష్టుపట్టించారని నాని దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని ప్రమాణస్వీకార సభలో చెప్పి ఏడాదిలో రెండుసార్లు 3 రెట్లు పెంచడమేంటని నిలదీశారు.
కరోనా వైరస్ విజృంభణ- వలస కార్మికుల కష్టాలు తీర్మానాన్ని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రవేశపెట్టగా..., మాజీ మంత్రి జవహర్, పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి దీన్ని బలపరిచారు. కరోనాను నియంత్రించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని వారు దుయ్యబట్టారు. కేంద్రసాయాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ వైకాపా ఎమ్మెల్యేలు, నేతలు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
రాజకీయ లబ్ధి కోసం తిరుమల వెంకటేశ్వరస్వామిని కూడా జగన్ వాడుకుంటున్నారని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. తితిదే ఆస్తుల అమ్మకంపై తీర్మానాన్ని ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు ప్రవేశపెట్టగా బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద సూర్య బలపరిచారు.