ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మా దేవుడు నువ్వేనయ్యా... మా కోసం వచ్చావయ్యా! - MAHABOOBABAD MRO GETS EMOTIONAL IN PASS BOOKS DISTRIBUTION PROGRAM

"భరత్​ అను నేను... ప్రజల కోసం అంతఃకరణశుద్ధితో పనిచేస్తాను" అని హీరో మహేశ్​బాబు చెప్పిన డైలాగ్​ని నిజం చేసి చూపించాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. గ్రామస్థుల పాట్లు చూడలేక వారికి ఇచ్చిన మాటను విస్మరించకుండా... కష్టపడి నిలబెట్టుకున్నాడు. దశాబ్దాలుగా ఉన్న సమస్యను పరిష్కరించాడు. రైతుల ముఖాల్లో సంతోషాన్ని చూసి.... జన్మధన్యమైందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఓ తహసీల్దార్​ ఆ గ్రామాల రైతులకు దేవుడయ్యాడు.

mahaboobabad-mro-gets-emotional-in-pass-books-distribution-program
mahaboobabad-mro-gets-emotional-in-pass-books-distribution-program

By

Published : Feb 3, 2020, 9:31 AM IST

మా దేవుడు నువ్వేనయ్యా... మా కోసం వచ్చావయ్యా!

ఏ తహసీల్దార్​ కార్యాలయం చూసినా... పుట్టలుపుట్టలుగా భూ సమస్యలు... ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ.. తిరుగుతూ.. విసిగి వేసారుతున్న రైతులు... పట్టాలు చేసేందుకు కాళ్లు పట్టుకున్నా.. కనికరించకుండా కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారులు... తమ సమస్యలు పరిష్కరించని ఉద్యోగులు శత్రువులేనంటూ పెట్రోల్​ సీసాలతో దాడులు... ఇలాంటి సమయంలో తెలంగాణలోని మహబూబాబాద్​ గ్రామీణ మండల తహసీల్దార్​ మాత్రం రైతుల పాలిట దేవుడయ్యాడు. భుజాలపై ఎక్కించుకుని మేళతాళాలతో ఊరేగించేంత అభిమానాన్ని చూరగొన్నాడు. ఆ క్షణాాన భావోద్వేగంతో ప్రజాప్రతినిధులు, గ్రామస్థులందరి సమక్షంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు రంజిత్​ కుమార్​ అనే తహసీల్దార్​.

రైతుల కష్టాలకు చలించి... మాటిచ్చి...

మల్యాల, మాధవాపురం, ఆమనగల్​ గ్రామాల్లోని చాలా మంది రైతులు దశాబ్దాలుగా భూమి సాగు చేసుకుంటున్నారు. వాళ్లకు పట్టాదారు పాసు​ పుస్తకాలు మాత్రం లేవు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రైతుబంధు పథకం ప్రవేశపెట్టడం వల్ల ఆయా గ్రామ రైతులంతా పట్టాలు అందించాలని కార్యాలయాల చుట్టూ తిరిగారు. సమస్య మాత్రం కొలిక్కిరాలేదు. ప్రమాదవశాత్తు మరణించినా రైతులకూ బీమా రాలేదు. ప్రభుత్వ ఫలాలేవీ అందకపోవటం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారు. ఆరునెలల క్రితం తహసీల్దార్​గా బాధ్యతలు స్వీకరించిన రంజిత్​కుమార్​... గ్రామస్థుల కష్టాలు చూసి చలించిపోయాడు. మీకు నేనున్నానంటూ... భరోసా ఇచ్చారు. పట్టాలు ఇప్పించిన తర్వాతే... ఊరు వదిలి వెళ్తానంటూ మాటిచ్చాడు.

నెలరోజుల్లో సమస్య పరిష్కారం...

గ్రామంలోని ప్రతి రైతు భూమిని సిబ్బందితో సర్వే చేయించాడు రంజిత్​. నెలరోజుల వ్యవధిలోనే గ్రామంలోని 1,548 మంది రైతులకు పట్టాలు తయారు చేయించాడు. ఎన్నికల కోడ్ వల్ల పంపిణీ చేయడం కాస్త ఆలస్యమైనా... చివరికి లబ్ధిదారులకు పాసు పుస్తకాలు అందించి మాట నిలబెట్టుకున్నాడు. ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ హాజరై పాసు పుస్తకాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్​కు గ్రామస్థులు మేళతాళాలతో స్వాగతం పలికారు. ఎన్నోఏళ్ల సమస్యను పరిష్కరించిన రంజిత్​ను అభిమానంతో భూజానికెత్తుకుని ఊరేగించారు.

కన్నీళ్లతోనే... ప్రసంగం...

రైతుల అభిమానానికి తహసీల్దార్​ రంజిత్​ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ భావాలను మాటలతో చెప్పలేక... ఆనందబాష్పాలతోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తాలూకు సంతృప్తిని వెలిబుచ్చాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని... రైతుల ముఖాల్లో సంతోషం నింపినందుకు తన జన్మధన్యమైందని రంజిత్​ తెలిపారు. ఉద్యోగరీత్యా తాను ఎక్కడికెళ్ళినా గ్రామ ప్రజలు గుండెలో ఉంటారన్న మాటలకు గ్రామస్థుల కళ్లు చెమర్చాయి.

ఆయనే మా దేవుడు...

ఇచ్చిన మాటను ఎంత కష్టమైనా నిలబెట్టుకున్న తహసీల్దార్​ను నేతలు ప్రశంసించారు. రంజిత్​ను ఆదర్శంగా తీసుకుని గ్రామాలకు సేవ చేయాలని అధికారులకు సూచించారు. తమ జీవనాధారాలను పట్టాలు చేయించి జీవితాల్లో వెలుగులు నింపిన తహసీల్దార్​... దేవుడితో సమానమని రైతులు కొనియాడుతూ ప్రేమ చాటుకున్నారు.

ఇవీ చూడండి:వారంలో 'రైతు రక్షణ బస్సు యాత్ర'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details