విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గంగా, పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు మంగళస్నానాలు నిర్వహించి వధూవరులుగా అలంకరించారు. అర్చకులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అంకురార్పణ, మండపారాధన, కలశస్థాపన, ధ్వజారోహన, అగ్రిప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
- మార్చి 1న వేకుమజామున 5 నుంచి రాత్రి 8 గంటల వరకు మల్లేశ్వరస్వామికి అభిషేకాలు, రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు మహాన్యాసం, రాత్రి 10 నుంచి 12.30 గంటల వరకు లింగోద్భవ కాలాభిషేకం. అనంతరం మల్లేశ్వరస్వామి దివ్యలీలా కల్యాణోత్సవాన్ని భక్తుల సమక్షంలో నిర్వహించనున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు.
- మార్చి రెండో తేదీ ఉదయం మల్లేశ్వరస్వామి ఆలయంలో సదస్యం, సాయంత్రం 4 గంటలకు ఉత్సవమూర్తులతో రథోత్సవాన్ని నిర్వహించనున్నారు.
- మార్చి 3న పూర్ణాహుతి, వసంతోత్సవం, దుర్గాఘాట్‌లో ధ్వజావరోహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
- మార్చి 4, 5 తేదీల్లో స్వామి వారికి ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవా కార్యక్రమాలతో మహాశివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.