GOVERNOR: ఒడిశాకు చెందిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు బక్సీ జగబంధు.. బ్రిటిషర్లపై చేసిన వీరోచిత సాయుధ పోరాటంపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఒడియాలో రచించిన ‘మహా సంగ్రామర్ మహా నాయక్’ నాటకాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రదర్శించనున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఈ నాటక ప్రదర్శనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 1803-1808 మధ్యకాలంలో కటక్, పూరీ, ఖోర్ధాలను బ్రిటిషర్లు స్వాధీనం చేసుకుని, ఆ ప్రాంత పాలకుడు గజపతి ముకుందదేవ్‌ని నిర్బంధించారు. రైతుల నుంచి అధిక పన్నులు వసూలు చేశారు. సముద్రం, చిలకా తీరాల నుంచి ఉప్పు సేకరించకుండా నిషేధించి, ప్రజల్ని తీవ్రంగా హింసించారు. అప్పుడు ముకుంద్‌దేవ్ సేనాపతి బక్సీ జగబంధు.. పైకా నాయకుల్ని ఏకం చేసి బ్రిటిష్‌వారిపై పోరాడి ఖోర్ధా, పూరీలను స్వాధీనం చేసుకున్నారు. గజపతి ముకుందదేవ్ అధికారాలను పునరుద్ధరించారు. అప్పట్లో బ్రిటిషర్లతో చేతులు కలిపిన కొందరు దేశద్రోహులు.. స్వాతంత్య్ర సమరయోధుల గుట్టుమట్లు బ్రిటిషర్లకు చేరవేసేవారు. ప్రజల్ని అణచివేస్తూ, అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్న బ్రిటిష్ మేజర్‌లు ప్లెచర్, ప్రైడ్‌లను.. బక్సీ బృందం హతమార్చింది. బ్రిటిషర్లు కోల్‌కతా, మద్రాసుల నుంచి భారీగా సైన్యాన్ని దించి.. వారు కోల్పోయిన ప్రాంతాల్ని మళ్లీ స్వాధీనం చేసుకున్నారు. బక్సీకి జమీందారులు ఆర్థిక సహాయం చేయకుండా బ్రిటిష్ పాలకులు అడ్డుకున్నారు. బక్సీ వెంట ఉన్న పైకాలు జీవనోపాధి కోసం చెదిరిపోయారు. అయినా వెరవకుండా, నమ్మకస్థులైన కొంతమంది పైకాల్ని కూడగట్టుకుని బ్రిటిషర్లపై బక్సీ గెరిల్లా యుద్ధం చేశారు. 1817 నుంచి 1825 వరకు ఆ పోరాటం కొనసాగింది. బక్సీ ధాటికి తట్టుకోలేని బ్రిటిష్ పాలకులు, ఆయనకు సన్నిహితుడైన నయాఘడ్ రాజు ద్వారా సంధికి ఒప్పించారు. సామాన్య ప్రజల శ్రేయస్సు కోసం వారి ప్రతిపాదనలకు బక్సీ అంగీకరించాడు. 1829లో ఆయన కటక్‌లో తుదిశ్వాస విడిచాడు. ‘మహా సంగ్రామర్ మహా నాయక్’ నాటకం ఒడిశాలో విశేష ఆదరణ పొందింది.
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘మహా సంగ్రామర్ మహా నాయక్’.. - గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
GOVERNOR: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఒడియాలో రచించిన ‘మహా సంగ్రామర్ మహా నాయక్’ నాటకాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం ప్రదర్శించనున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఈ నాటక ప్రదర్శనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఒడిశాకు చెందిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు బక్సీ జగబంధు.. బ్రిటిషర్లపై చేసిన వీరోచిత సాయుధ పోరాటంపై ఆయన నాటకాన్ని రచించారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి..:బిశ్వభూషణ్ హరిచందన్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒడిశా ప్రభుత్వంలో 4 సార్లు మంత్రిగా సేవలందించారు. ప్రముఖ సాహితీవేత్త, కాలమిస్ట్ కూడా. ఆయన రచించిన 9 నాటకాలు ఆదరణ పొందాయి. రాజకీయ, చారిత్రక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై ఆయన వ్యాసాలు ఒడియా, ఆంగ్ల భాషా పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆయన రాసిన 26 చిన్న కథలతో ఒక సంకలనాన్ని.. ఎంపిక చేసిన వ్యాసాలతో సంకలనాన్ని ప్రచురించారు. ‘సంగ్రామ్ సొరి నహీ’ పేరుతో తన ఆత్మకథను వెలువరించారు. ‘మహా సంగ్రామర్ మహా నాయక్’ నాటకాన్ని రాష్ట్ర సాంస్కృతిక విభాగం, అభినయ థియేటర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రదర్శించనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్‌భార్గవ తెలిపారు.
ఇవీ చదవండి: