విజయవాడలో చిరు వ్యాపారులు, కూలీలు ఎక్కువగా ఉండే ప్రాంతం మధురానగర్. నగరంలోని 5 డివిజన్లకు కేంద్రమైన ఈ ప్రాంతంలో 50 వేల మందికిపైగా జీవిస్తున్నారు. వీరంతా నగరంలోకి పనుల కోసం, వ్యాపారాల కోసం వెళ్లేందుకు ప్రతిరోజూ పట్టాలు దాటాల్సి వస్తోంది. 29, 30, 31 డివిజన్లు, వాంబే కాలనీ ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో పట్టాలపై వెళ్తున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు ఎప్పుడో మొదలైనా..ఇంకా పూర్తి కాలేదు. కొంత మేర పనులు చేసి అర్దాంతరంగా వదిలేశారని స్థానికులు వాపోతున్నారు. పట్టాలు దాటే క్రమంలో పిల్లలకు, వృద్ధులకు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే శాఖ పనులు పూర్తి చేసినా..నగరపాలక శాఖ చేయాల్సిన పనులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు.
ఒక్కోసారి గేట్లు పడినప్పుడు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. త్వరితగతిన వంతెన నిర్మించకపోతే నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన పూర్తయ్యే వరకు రైల్వే క్వార్టర్స్ మార్గంలో దారి ఇవ్వాలని కోరుతున్నారు. కాగా..మధురానగర్‌లో అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్‌ను 20 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కరోనా వల్ల పనులు వాయిదా పడ్డాయని.. ఇకపై త్వరితగతిన పూర్తి చేసేలా చూస్తామన్నారు.