ADULTERATED OILS విదేశాల నుంచి వచ్చే నూనెను మన రాష్ట్రంలోని రీప్యాకింగ్ సంస్థలు ప్యాకెట్లు, డబ్బాల రూపంలో మార్చి, మార్కెటింగ్ చేస్తున్నాయి. ఇలాంటి పరిశ్రమలు ఎక్కువగా నరసరావుపేట, కడప, కర్నూలు, కాకినాడ, అనంతపురంతో పాటు మరికొన్ని చోట్ల కేంద్రీకృతమయ్యాయి. వినియోగదారులతోపాటు చిరువ్యాపారులకు విక్రయిస్తున్న కొన్ని నూనెల్లో కల్తీ అధికంగా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ఒకటి నుంచి 14 వరకు రాష్ట్రంలోని రీప్యాకింగ్, లోకల్ బ్రాండ్ల పరిశ్రమల నుంచి 155 నమూనాలను సేకరించారు. వీటిలో 10% నూనెలో నాణ్యత లేదని రిపోర్టులు వస్తున్నాయని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ జగదీశ్వరి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో 680 నమూనాలను పరీక్షిస్తే 66 కేసుల్లో నాణ్యత లేదని తేలింది.
వేరుసెనగ, కొబ్బరి, పొద్దుతిరుగుడు..
సాధారణంగా రాష్ట్రంలో వేరుసెనగ, కొబ్బరినూనె, పొద్దుతిరుగుడు నూనెలను అధికంగా వాడుతున్నారు. వీటి ధరలూ ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు రకాల నూనెల్లోనే కల్తీ ఎక్కువగా జరుగుతోంది. ధర తక్కువగా ఉండే పామోలిన్ నూనెను కలుపుతున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారి ఒకరు తెలిపారు. వేరుశెనగ నూనెలో... పామోలిన్, సూపర్‌వోలిన్ (పామోలిన్‌ను రిఫైన్డ్ చేస్తే వచ్చేది), రిఫైన్డ్ కాటన్ సీడ్ ఆయిల్ (పత్తి విత్తనాల నుంచి తయారు చేసేది)ను కలిపేస్తున్నారు.
పొద్దుతిరుగుడు నూనెలోనూ పామోలిన్, రిఫైన్డ్‌కాటన్ సీడ్ ఆయిల్ మిశ్రమం చేస్తున్నారు. కొబ్బరి నూనెలోనూ పామోలిన్ కలుపుతున్నారు. రాష్ట్రంలో చాలాచోట్ల హోటళ్లు, టిఫెన్ సెంటర్లు, బజ్జీల కొట్లు, నూడుల్స్, గోబీ సెంటర్లు, చికెన్ బిర్యానీ విక్రయ కేంద్రాల్లో ఇలాంటి నూనెల వాడకం ఎక్కువగా ఉంది. ఒకసారి వాడిన నూనె మరోసారి వాడకూడదు. కానీ... చిరు వ్యాపారుల్లో కొందరు ఆర్థిక పరిస్థితులు, స్వలాభం కోసం పదేపదే ఆయిల్‌ను వేడి చేస్తూ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. ఈ చర్యలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి.