Loss to farmers: ధాన్యం రైతుల ఆశలపై అసని తుపాను నీళ్లు చల్లింది. కళ్లాల్లో, రహదారులపై ఆరబెట్టిన వడ్లు రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు తడిసిపోయాయి. అమ్మకానికి తెచ్చి నెల అవుతున్నా.. ప్రభుత్వం తీసుకోకపోవడంతో మరికొందరికి తీవ్ర నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల కోత కోసిన వరి పనలు నీట నాని మొలకలొస్తున్నాయి. తడిసిన ధాన్యాన్ని ఎలా అమ్ముకోవాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
తూర్పు, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, ఏలూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వరి దెబ్బతింది. వర్షాలు ఇంకా కొనసాగుతుండటంతో ఆరబెట్టే అవకాశమూ లేక పట్టలు కప్పి, నీరు నిలవకుండా బయటకు పంపేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు, మళ్లీ కుప్ప చేసేందుకు కూలీల ఖర్చు, తడవకుండా కప్పేందుకు పట్టాల వ్యయం రోజుకు రూ.1,500 నుంచి రూ.2 వేలకు పైగా అవుతోందని కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ప్రభుత్వం కొనక.. ప్రైవేటుకు అమ్ముకోలేక..నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం (గతంలో ప్రకాశం జిల్లా) వీరేపల్లిలో చెరువు కింద 400 ఎకరాల్లో రైతులు ధాన్యం పండించారు. పౌర సరఫరాల సంస్థకు అమ్మేందుకు అక్కడి మార్కెట్‌కు తీసుకెళ్లారు. నెల అవుతున్నా వారి నుంచి ధాన్యం కొనలేదు. జిల్లా మారడంతో రైతుల పేర్లు అనుసంధానం కాలేదని సాగదీశారు. సాయంత్రానికి పట్టాలు కప్పడం, ఉదయాన్నే తీయడం.. నెల రోజులుగా ఇదే పని. ఈ లోగా భారీవర్షాలు కురవడంతో ధాన్యం రాశుల అడుగు భాగం తడిసింది.
నీరు నిలవకుండా బయటకు పంపేందుకు జేసీబీని అద్దెకు తెచ్చి అక్కడే పెట్టుకున్న పరిస్థితి.. పక్కనున్న చాగల్లులోనూ పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయలేదు. ఫలితంగా రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్మేస్తున్నారు.