ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న ఇటీవలి పరిణామాలు ఆందోళనకరమని లోక్‌సత్తా, ప్రజాస్వామ్య పీఠం (ఎఫ్‌డీఆర్) వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. పార్టీల మధ్య ఈ తరహా రాజకీయం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. ఈ రాజకీయవేడి చల్లార్చేందుకు చొరవ చూపాలంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, పౌరసమాజం, మీడియా సంస్థలకు శనివారం ఆయన బహిరంగ లేఖ రాశారు.
‘నాయకుల మధ్య రాజకీయ విభేదాలు.. కక్షలు కార్పణ్యాలు, ద్వేషం, పరుష, అనాగరిక భాష వినియోగం, హింస, భావోద్వేగాలకు దారితీస్తున్నాయి. ఇది బహిరంగ చర్చ ప్రమాణాలు, చట్టబద్ధపాలనను పరిహసిస్తోంది. ఈ రాజకీయ విభేదాల్లో సైద్ధాంతిక, విధానపరమైన అంశాలేమీ లేవు. రాష్ట్ర విభజనతో సంక్షోభంలో ఉన్న ఏపీ ప్రజలకు ఆదర్శవంతమైన నాయకత్వాన్ని ఇవ్వాలి’ అని లేఖలో ఆయన పేర్కొన్నారు.
- భావోద్వేగాలు, హింస తీవ్రంగా పెరిగిన ప్రస్తుత సమయంలో తప్పుల్ని ఎంచడం వల్ల ఉపయోగం లేదు. ఎదుటి వారిలో తప్పుల్ని వెతకడానికి తప్ప తమ తప్పుల్ని గుర్తించడానికి ఎవరూ ఇష్టపడరు. ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీల్లో కుల, మతాలకు అతీతమైన అద్భుత నాయకత్వం ఉంది. అలాంటి మంచి ఆలోచనలు, మంచి నాయకత్వ సామర్థ్యం బయటపడటమే కష్టమైంది. తీవ్ర ఆర్థిక సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ఏపీ భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో కలిసి పనిచేయడం ప్రభుత్వంతో పాటు అన్ని పార్టీల ఉమ్మడి బాధ్యత. అందుకు సహకరించడం, సమాజానికి సరైన మార్గం చూపెట్టడం పౌరసమాజం, పత్రికల కర్తవ్యం.
- పేదలకు తాత్కాలిక సాయం అందిస్తూనే దీర్ఘకాలికంగా ఆదాయం, యువతకు ఉపాధి పెంచే రీతిలో ఆర్థికాభివృద్ధికి సమాజాన్ని సన్నద్ధం చేయడం ప్రస్తుత రాజకీయం ముందున్న పెనుసవాల్. అభిప్రాయభేదాల్ని విస్మరించి అన్ని వర్గాల్ని కలుపుకొని సామరస్య వాతావరణాన్ని నెలకొల్పే బాధ్యత ప్రభుత్వానికి, అన్ని రాజకీయపార్టీలకు, మీడియాకు ఉంది. కవ్వింపు చర్యలు, మాటల్ని వీడండి. రాజకీయవేడి చల్లార్చండి.
- పెట్టుబడులు, ఆదాయం, ఉపాధి కల్పనకు కేంద్రంగా ఉన్న మహానగరాన్ని రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వనరులు సద్వినియోగం, ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపు, పేదరిక నిర్మూలన, ఆర్థిక ప్రగతి ఉమ్మడి లక్ష్యం కావాలి.