Lokesh On Employees Agitation : ఉద్యోగుల పట్ల సీఎం జగన్ తీరుపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. జగన్ రెడ్డి ఉద్యోగుల పట్ల ఎందుకింత క్రూరంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. మాట తప్పిన ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. శాంతియుతంగా ఉద్యోగులు నిరసన తెలపడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ప్రసాదించిన హక్కుని హరించే అధికారం వైకాపాకు ఎవ్వరిచ్చారని లోకేశ్ దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం గౌరవం వున్నా.. ప్రభుత్వ ఉద్యోగుల్ని నిర్బంధించడం ఆపాలని కోరారు. విశ్వసనీయత అనే పదం అర్థం తెలిస్తే..ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామన్నవన్నీ ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం అంటూనే మానసికంగా, భౌతికంగా హింసిస్తున్నారని వాపోయారు. డిమాండ్లు పరిష్కరించాలని రోడ్డెక్కితే..పోలీసుల్ని ఉసిగొల్పి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీశారని లోకేశ్ ధ్వజమెత్తారు.