Nara Lokesh comments on YSRCP: తెదేపా వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ వ్యాపారస్తుల ఆత్మీయ సమావేశంలో నారా లోకేశ్ పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యాపారస్తుడికి జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ లోకేశ్ కరపత్రం విడుదల చేశారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో క్రాప్, పవర్, ఆక్వా, బిజినెస్ హాలిడేలు ఉన్నాయని.. చివరికి జగన్ కూడా హాలిడే తీసుకునే రోజు దగ్గర పడిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎద్దేవా చేశారు. జగరోనా అనే వైరస్‌ని అంతమొందించడానికి వ్యాక్సిన్ వస్తుందని.. దాని పేరు చంద్రబాబు అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని రోడ్ల గురించి పక్క రాష్ట్రంలోని మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి, వైకాపా నేతల బెదిరింపులు, వేధింపులు, వాటాల దెబ్బలను తట్టుకోలేకే కంపెనీలు, వ్యాపారస్తులందరూ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నారని పేర్కొన్నారు. ఇసుక పాలసీ మార్చి భవన నిర్మాణ రంగాన్ని, దానికి అనుబంధంగా వున్న 130కి పైగా వ్యవస్థల్ని అస్థవ్యస్తం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం అనాలోచిత విధానాలతో విద్యుత్ కోతలు ఆరంభించి పరిశ్రమలకి పవర్ హాలీడే ప్రకటించేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో రైతుకు సబ్సిడీలో 1,14,000రూపాయలకే 40కేవీఏ ట్రాన్స్ఫార్మర్ అందిస్తే.. జగన్ మాత్రం రూ.3,37,000 వసూలు చేయడం ఆక్వారంగానికి అదనపు భారం అన్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాపారస్తుల ఆత్మీయ సమావేశం
"లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెబుతున్నారు. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో ఈ ప్రభుత్వం చెప్పాలి. తెదేపా ఐదేళ్ల పాలనలో 39,450 పరిశ్రమలు తెచ్చాం. వైకాపా హయాంలో పారిశ్రామికవేత్తలు, చిరువ్యాపారులు భయపడుతున్నారు. జగన్ వైరస్‌కు భయపడి అనేక పరిశ్రమలు పారిపోతున్నాయి. వైకాపా హయాంలో ఆక్వా, పౌల్ట్రీ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు కూడా కష్టాలు పడుతున్నారు. చెత్తపై పన్ను వేసినందుకు చిరువ్యాపారులు తిట్టుకుంటున్నారు. ఆఖరికి బాత్‌రూమ్‌పైనా పన్ను వేసే స్థాయికి వచ్చారు" -నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
వేలాది మందికి ఉపాధి కల్పించే ఆటోనగర్లను కొట్టేయడానికి వైకాపా నాయకులు స్కెచ్ వేశారని ఆరోపించారు. దశాబ్ధాల క్రితం ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడలు, ఆటోనగర్లు ప్రస్తుతం జనావాసాల మధ్యలోకి వచ్చి కాలుష్య కారకాలుగా మారాయని.. వాటిని ఊరికి దూరంగా తరలిస్తామనడంలో పెద్ద కుట్ర ఉందన్నారు. బెల్లం వ్యాపారస్థులపై కక్షసాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుందని.. బెల్లం వ్యాపారస్థులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకుని.. వారిపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలతో నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజుకీ ఇసుక సమస్య అలానే ఉందని.. దీనివల్ల లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. నిర్మాణ రంగాన్ని నమ్ముకున్న వారంతా అప్పులపాలయ్యారని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: