ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 1, 2021, 5:34 PM IST

ETV Bharat / city

Polavaram Compensation: ఎకరాకు రూ.19 లక్షల హామీ ఏమైంది?: లోకేశ్

పోలవరం నిర్వాసితులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు నిర్వాసితులకు ఎకరాకు రూ. 19 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. ఈ మేరకు సీఎం జగన్​కు బహిరంగ లేఖ రాసిన లోకేశ్..నిర్వాసితులకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చటంతో పాటు వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఎకరాకు రూ.19 లక్షల హామీ ఏమైంది?
ఎకరాకు రూ.19 లక్షల హామీ ఏమైంది?

పోలవరం నిర్వాసితులకు ఎకరాకు రూ.19లక్షలు చెల్లిస్తానని ప్రతిపక్షనేతగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. మాట తప్పనని చేసుకునే ప్రచారానికి కట్టుబడి పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చటంతో పాటు వారికి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 275 ప్రభావిత గ్రామాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి, కేవలం 9 గ్రామాల్లో మాత్రమే అరకొరగా పరిహారం అందచేయటాన్ని తప్పుబడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

జగన్​కు రాసిన బహిరంగ లేఖ

"పోలవరం ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. వ‌ర‌ద‌ల్లో నిండామునిగిన నిర్వాసితుల‌కు ఒక కొవ్వొత్తి, 2 బంగాళాదుంపలు ఇచ్చి అమాన‌వీయంగా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా పోల‌వ‌రం నిర్వాసిత గ్రామాల్లో పర్యటించినప్పుడు ఎకరాకు రూ.19 లక్షలని ఓ సారి, రూ.10లక్షల ఇస్తానని మరోసారి మాట మార్చారు. భూమి లేని వారికి రూ.10 లక్షలతో పాటు, వ‌ల‌స వెళ్లిన వారికి కూడా ప్యాకేజీ అమ‌లు, భూమి కోల్పోయిన వారికి భూమి, పోడు భూమి అయితే ప‌ట్టా భూమి ఇస్తాన‌ని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్కటీ నెర‌వేర్చ‌లేదు. 1.15లక్షల పరిహారం ఇచ్చిన భూములకు రూ.5 లక్షలు, 18 ఏళ్లు నిండిన వారికి పరిహారం ప్యాకేజీ, 25రకాల సౌకర్యాలతో కాలనీల నిర్మాణం, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లింపు అంటూ నాడు బహిరంగ సభలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. నిర్వాసితులది చిన్న సమస్యే అంటున్న మంత్రులు.. ఆ దిశగా చిన్న ప్రయత్నం కూడా చేయకపోవటం విచారకరం. 18 వేల మంది నిర్వాసితుల్ని జూన్ 2020 నాటికి ఇళ్లలోకి పంపిస్తామని జలవనరుల శాఖ మంత్రి మాటిచ్చారు. పోలవరం ప్రాంతంలో రాజ‌శేఖ‌ర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటుకు రూ.200 కోట్లు కేటాయించారు. ఉండేందుకు ఇళ్లు, తాగేందుకు నీళ్లు, విద్యుత్ సౌకర్యం వంటివి లేక నిర్వాసితులు సమస్యలతో సావాసం చేస్తుంటే ప్రభుత్వంలో స్పందన లేదు. ప్రభుత్వం పునరావాస కల్పనలో ప్రభుత్వం విఫలమైందని జాతీయ ఎస్టీ కమిషన్ ఆక్షేపించినా ప్రభుత్వంలో స్పందన లేదు" అని లోకేశ్ లేఖలో విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details