మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఎన్నికల కోసం శ్రమించిన తెదేపా కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు ట్వీటర్ వేదికగా అభినందనలు తెలిపారు.
"ఎన్నికల్లో వైకాపా అరాచకాన్ని, జగన్‌రెడ్డి అధికారమదాన్ని ఎదిరించి నిలిచి గెలిచినవారికి, పోరాడి ఓడిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎన్నికల్లో పోటీచేస్తే చంపేస్తామని వైకాపా నేతలు బెదిరించినా.. నామినేషన్లు వేసిన కొందరిని చంపేసినా..బెదరకుండా తెలుగుదేశం సైనికులు ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికలే జరపకూడదనుకున్న జగన్‌రెడ్డి సర్కారు అప్రజాస్వామిక వైఖరిని ప్రజల ముందు ఉంచడంలో తెదేపా సక్సెస్ అయ్యింది. వైకాపాకు ఓట్లు వేయకుంటే పథకాలు ఆపేస్తామని ఓటర్లను భయపెట్టి జరిపిన ఎన్నికల ఫలితాలు చూసి నిరాశ చెందొద్దు" అని ట్వీట్ చేశారు.