పాఠశాలల ప్రారంభం రోజునే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు శరాఘాతంగా మారిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. పేదపిల్లలకు ప్రభుత్వ విద్యని దూరం చెయ్యొద్దంటూ ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఆగమేఘాలపై జాతీయ విద్యా విధానం అమలు, పాఠశాలల విలీనం నిర్ణయం పేద విద్యార్థుల్ని ప్రభుత్వ విద్యకి దూరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత, అరకొర సౌకర్యాలతో ప్రభుత్వ విద్యాలయాలు సమస్యల వలయంలో చిక్కుకుంటే.., పాఠశాలల విలీన నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైందని దుయ్యబట్టారు. పాఠశాలలు విభజించాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసినా.. వైకాపా ప్రభుత్వం పట్టించుకోకుండా విభజించటంతో సమస్య తీవ్రమైందని మండిపడ్డారు. జాతీయ విద్యావిధానం అమలు చేసే తొందర కంటే పాఠశాలలు, ఉపాధ్యాయుల్ని తగ్గించే ఆతృత జగన్‌లో కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవో అమలు వల్ల పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్దీకరణతో నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ బడులు ఇంకా దూరం అవుతున్నాయని ధ్వజమెత్తారు. ఇంటికి దగ్గరలో ఉన్న బడిని తీసేయటం వారిని చదువుకి దూరం చేయటమే అవుతుందన్నారు. 2 కిలో మీటరు పరిధిలో 3,4,5 తరగతులను అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోనూ, హైస్కూల్స్‌లోనూ విలీనం చేయటం వల్ల ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి పూర్తిగా పెరిగిపోయిందని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుల్ని కేటాయించకపోవడం విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపనుందని పేర్కొన్నారు. పిల్లలకు పాఠశాలలు ఒక కిలోమీటరు దూరంలోపే ఉండాలని విద్యావిధానాలు చెబుతుంటే.. జగన్ మాత్రం ఏకంగా 3 కిలోమీటర్ల దూరానికి పాఠశాలలు తరలించడం ప్రభుత్వ విద్యని పేదలకి దూరం చేయడమే అని లేఖలో మండిపడ్డారు.