ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతుల్లేని రాష్ట్రంగా ఏపీ.. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతోనే క్రాప్‌ హాలీడేలు: లోకేశ్ - సీఎం జగన్​కు లోకేశ్ లేఖ

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా రైతుల్లేని రాష్ట్రంగా ఏపీ మారుతోందని తెదేపా నేత నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికే ధాన్యాగారంగా.. "అన్నపూర్ణ" అని పిలిపించుకున్న ఆంధ్రప్రదేశ్‌లో వ్యవ‌సాయ‌రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రైతులు పంట విరామం ప్రకటిస్తూ వ్యవసాయానికి దూరమవటం బాధాకరమన్న ఆయన.. రైతులు క్రాప్‌ హాలీడే విర‌మించేలా త‌క్షణ‌మే చ‌ర్యలు తీసుకోవాలని సీఎం జగన్​కు లోకేశ్ లేఖ రాశారు.

లోకేశ్ తాజా వార్తలు
లోకేశ్ తాజా వార్తలు

By

Published : Jun 11, 2022, 10:19 PM IST

రైతులు క్రాప్‌ హాలీడే విర‌మించేలా త‌క్షణ‌మే చ‌ర్యలు తీసుకుని అన్నదాతలను ఆదుకోవాలంటూ తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్​కు లేఖ రాశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా రైతుల్లేని రాష్ట్రంగా ఏపీ మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికే అన్నపూర్ణ అని పిలిపించుకున్న ఆంధ్రప్రదేశ్‌లో వ్యవ‌సాయ‌రంగం ప‌ట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పంట విరామం ప్రకటిస్తూ.. రైతులు వ్యవసాయానికి దూరమవటం బాధాకరమన్నారు.

గతేడాది రాష్ట్రంలో కర్నూలు, కడప, ఉభయ గోదావరి జిల్లాల్లో క్రాప్‌ హాలిడే ప్రకటించారని గుర్తుచేశారు. అప్పుడే రైతుల స‌మ‌స్యలు గుర్తించి ప‌రిష్కారానికి చ‌ర్యలు తీసుకుని ఉంటే ఈ ఏడాది మ‌రిన్ని ప్రాంతాల్లో క్రాప్ హాలీడే ప్రక‌టించేవారు కాదని అన్నారు. ఈ-క్రాప్‌ బుకింగ్‌లో స‌మ‌స్యలు, సున్నా వడ్డీకి రుణాలు అంద‌క‌పోవ‌టం, వ‌రికి మద్దతు ధర లేకపోవటం, ధాన్యం కొనుగోలు చేసి బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌టం వంటి ఇబ్బందుల‌ను ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోకుండా మొద్దునిద్ర నటిస్తున్నారని మండిపడ్డారు.

మూడేళ్లలో ప్రకృతి వైపరీత్యాలతో 50 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే.. ఏ ఒక్క రైతును కూడా ప్రభుత్వం ఆదుకోలేదని లోకేశ్ ధ్వజమెత్తారు. పెట్టుబడికి, రాబడికి మధ్య భారీ వ్యత్యాసం నెలకొందని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌, వ్యవసాయం, యంత్ర పనిముట్ల ధరలు పెరిగిన స్థాయిలో వ‌రి మద్దతు ధర పెంచ‌క‌పోవ‌డంతో వ్యవ‌సాయం న‌ష్టాల‌మ‌యం అవుతోందన్నారు. ప్రభుత్వ చర్యలతో రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే మూడోస్థానంలో ఉండగా, కౌలు రైతుల మరణాల్లో రెండో స్థానంలో నిల‌వ‌డం వ్యవ‌సాయ‌రంగ సంక్షోభాన్ని సూచిస్తోందని దుయ్యబట్టారు. ఇప్పటికి 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ సొంత జిల్లా క‌డ‌ప‌లో పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నా.. గ‌తేడాది నుంచి రైతులు పంట విరామం కొనసాగిస్తున్నారని, కేసీ కెనాల్ కింద 90 వేల ఎకరాలు ఆయకట్టు ఉంటే మెజార్టీ రైతులు సాగుకు దూరమయ్యారని లేఖలో పేర్కొన్నారు.

గోదావ‌రి జిల్లాలు, అనంతపురం, కర్నూలు, నెల్లూరులోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పంట విరామం ప్రకటించారని లేఖలో లోకేశ్ ప్రస్తావించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 5 లక్షల ఎకరాల్లో మిర్చి వేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వక‌పోవ‌డం దారుణమని అన్నారు. తెదేపా ప్రభుత్వ హ‌యాంలో ధాన్యం బకాయిలు వారంలోనే చెల్లించగా, నేడు 3 నెలలు దాటినా బకాయిలు చెల్లించకపోవటం రైతు ద్రోహం కాదా ? అని నిలదీశారు. రైతుల్ని ఆదుకుని వ్యవ‌సాయ‌రంగ సంక్షోభాన్ని నివారించాల‌నే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే వ్యవ‌సాయ మోటార్లకు మీటర్లు బిగించ‌టం ఆపేయాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ. 7 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరం పూర్తిచేసి నదుల అనుసంధానం ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమకు సాగునీరు, తాగునీరు అందించాలని కోరారు. క్రాప్ హాలీడే ప్రక‌టించిన ప్రాంతాల్లో సీఎం నేరుగా ప‌ర్యటించి, ప్రభుత్వం అండ‌గా ఉంటుంద‌నే భ‌రోసా నింపి రైతులు పంట‌లు వేసేలా ప్రోత్సహించాలని లోకేశ్ లోఖలో సూచించారు.

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details