Lokesh: పోలవరం ఏఈ సూర్యకిరణ్‌పై వైకాపా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. వైకాపా నాయకుల ఉన్మాదం కట్టలు తెంచుకుంటోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు, ప్రజలు అయిపోయి.. ప్రభుత్వ ఉద్యోగులపై పడ్డారని మండిపడ్డారు. తన అనుచరుల బిల్లులు మంజూరు చేయలేదని ఏఈ సూర్య కిరణ్‌ను వైకాపా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కొట్టడం దారుణమన్నారు.
మంత్రి, ఉన్నతాధికారుల సమక్షంలోనే ఇంజనీరుపై దాడి జరిగినా.. ఎవరూ ఆపే ప్రయత్నం చెయ్యకపోవడం విచారకరమని అన్నారు. ఈ దాడిని ఉద్యోగ సంఘాల నేతలు ఖండించకపోవడం అన్యాయమేనని పేర్కొన్నారు. దాడి చేసిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజాని తక్షణమే అరెస్ట్ చేసి, బాధితుడు ఏఈ సూర్య కిరణ్‌కి న్యాయం చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
అసలేం జరిగింది.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తనపై దౌర్జన్యం చేసి, మూడుసార్లు చెంప మీద కొట్టారని.. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ రెండో డివిజన్ సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్ (ఏఈఈ) సూర్యకిరణ్.. రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుడి వివరాల మేరకు... పోలవరం ప్రధాన ఎడమ కాలువకు సంబంధించిన పుష్కర కాలువ రంగంపేట పరిధిలో ఉంది. దాని పూడికతీత, అభివృద్ధి పనులు చేయాలని ఆయకట్టు రైతులు కోరగా.. నిధులు మంజూరు కాలేదని జలవనరుల శాఖ అధికారులు చెప్పారు. తామే ఆ పనులు చేపడతామని, నిధులు మంజూరయ్యాక ఇవ్వాలని రైతులు వారిని ఒప్పించి పనులు చేశారు. రెండేళ్లయినా నిధులు మంజూరు కాకపోవడంతో రైతులు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను ఆశ్రయించారు. బిల్లులు చెల్లించాలని ఏడాదిగా ఎమ్మెల్యే అధికారులను అడుగుతున్నారు.