వ్యవస్థల విధ్వంసానికి సీఎం జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(tdp leader nara lokesh) విమర్శించారు. పల్లె పోరులో ఫ్యాన్‌కు ఓటేస్తే గ్రామాల రూపురేఖలు మారుస్తానన్న జగన్ రెడ్డి.. ఇప్పుడు ఏకంగా పంచాయతీ ఖాతాల్లో ఉన్న సొమ్ముని కాజేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ విరుద్ధంగా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి విద్యుత్ బకాయిలంటూ.. రూ.345 కోట్లు కట్ చేశారని తెలిపారు. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం కేటాయించిన రూ.965 కోట్లను.. ప్రభుత్వం పక్కదారి పట్టించడం గ్రామీణ ప్రజలకు తీరని అన్యాయం చెయ్యడమేనని మండిపడ్డారు.
15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులతో.. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సర్పంచులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తరువాత.. ఖాతాల్లో సొమ్ము సున్నా అయితే వారు ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం మళ్లించిన సొమ్ముని పంచాయతీల ఖాతాల్లో వెయ్యాలని లోకేశ్ డిమాండ్ చేశారు.