Lokesh On RI Incident: క్యాసినో స్టార్ విశ్వరూపం అంటే ఇదేనా?: నారా లోకేశ్ - ఆర్ఐ అరవింద్‌పై దాడి కొడాలి నాని పనే
Lokesh On RI Incident: ఆర్ఐపై జరిగిన దాడి ముమ్మాటికీ మాజీ మంత్రి కొడాలి నాని పనేనని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. సీఎం ప్రోత్సాహంతోనే మట్టిమాఫియాలు, గడ్డం గ్యాంగులు బరితెగిస్తున్నాయని ఆరోపించారు. నేడు రెవెన్యూ అధికారులపైకి వచ్చిన జేసీబీ రేపు పోలీసులపైకీ రారన్న గ్యారెంటీ ఉందా అని ప్రశ్నించారు.
Lokesh On RI Incident: కృష్ణా జిల్లా మోటూరులో మట్టి తవ్వకాలను అడ్డుకున్న ఆర్ఐ అరవింద్‌పై దాడి ముమ్మాటికీ.. కొడాలి నాని పనేనని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. మంత్రి పదవి పోయిన క్యాసినో స్టార్... విశ్వరూపం చూపిస్తానంటే ఏంటో అనుకున్నామని.. ఇలా తన మాఫియా గ్యాంగులను అడ్డుకునే రెవెన్యూ అధికారులపై దాడులు చేయడమా అని నిలదీశారు. సీఎం ప్రోత్సాహంతోనే మట్టిమాఫియాలు, గడ్డం గ్యాంగులు బరితెగిస్తున్నాయని ఆరోపించారు. రెవెన్యూ సిబ్బంది ప్రాణాల్ని తీసేందుకు యత్నించిన గడ్డం గ్యాంగ్ మట్టిమాఫియా అరాచకాలు పోలీసులకి పట్టవా అని నిలదీశారు. R.I.పై దాడిచేసిన మట్టిమాఫియా.. దాని వెనుకున్న గడ్డం గ్యాంగ్ బాస్‌ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నేడు రెవెన్యూ అధికారులపైకి వచ్చిన జేసీబీ రేపు పోలీసులపైకీ రారన్న గ్యారెంటీ ఉందా అని ప్రశ్నించారు. ప్రజల్ని ఎలాగూ రక్షించలేని.. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు వారి ప్రాణాల్నైనా వైకాపా రాక్షసుల నుంచి కాపాడుకోవాలన్నారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు రక్షణ కల్పించాలని కోరారు.