LOKESH: గవర్నమెంట్ జీవోల స్థానంలో.. జగన్ జీవోలు తెస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. మూడేళ్ల పాలనలో సర్కారు ఖజానాలో డబ్బులు లేవని ప్రజాసంక్షేమ పథకాలు నిలిపేసిన ప్రభుత్వం.. సాక్షిలో ప్రకటనలకు మాత్రం రూ.300 కోట్లు ఇచ్చిందని మండిపడ్డారు. తాజాగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వార్డు సచివాలయాల్లో సాక్షి పత్రిక వేయించుకోవాలనే హుకుం జారీతో మరికొన్ని కోట్లు గుంజేశారని ఆరోపించారు.
సచివాలయంలో సాక్షి పేపర్, మొబైల్లో ఈ పేపర్ యాక్సెస్ వుండగా.. మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకోవాలంటే సాక్షి వేయించుకోవాలని నెలకి 5.32 కోట్ల రూపాయల విలువైన జీవో జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి రూ. 63.84 కోట్ల జనం సొమ్ము జలగలా పీల్చేస్తున్న జగన్.. జనానికి ఎదురొచ్చినా.. జనం ఎదురెళ్లినా అతనికే రిస్క్ అని ఎద్దేవా చేశారు. అవినీతి బకాసురుడు జగన్ ఆకలికి ఆంధ్రప్రదేశ్ ఆహారమైపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.