రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌పై.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంపీ రఘురామ చెప్పినట్లు జగన్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని విమర్శించారు. మూడో దశలో పిల్లలపై కరోనా తీవ్రత ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నా.. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించాలని అనుకోవడం సరికాదన్నారు. పిల్లలకు సరైన ఆన్‌లైన్ క్లాసులు కూడా జరగలేదని.. పేదలకు ఉపయోగపడే ఫైబర్ నెట్‌ను నాశనం చేశారని ఆరోపించారు. జగన్ నిర్ణయాలతో పిల్లల్లో మానసిక ఆందోళన ఎక్కువవుతోందన్నారు.
ప్రారంభమైన ఇంటర్ ఆన్లైన్ తరగతులకు హాజరవ్వాలో.. లేక పదోతరగతి పరీక్షలకు సిద్ధమవ్వాలో.. అర్థంకాని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారని లోకేశ్ తెలిపారు. 'కరోనా కల్లోల సమయంలో పరీక్షల నిర్వహణ - విద్యార్థుల పై పెరుగుతున్న ఒత్తిడి'.. అంశంపై మానసిక వైద్య నిపుణులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహించారు.