ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బూమ్ బూమ్ రెడ్డి బుస్సు మాటలు.. మోసాలకు అడ్డూ అదుపూ లేదు: లోకేశ్‌ - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

LOKESH ON LIQUOR: ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అన్న జగన్‌.. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్​ని సంపూర్ణ మద్యపానప్రదేశ్‌గా మార్చారని లోకేశ్‌ విమర్శించారు. మద్యపాన నిషేధం అనే ఊసు కూడా ఎత్తేది లేదంటూ రాసిచ్చారని మండిపడ్డారు.

LOKESH ON LIQUOR
LOKESH ON LIQUOR

By

Published : Jun 12, 2022, 12:25 PM IST

LOKESH ON LIQUOR: బూమ్ బూమ్ రెడ్డి బుస్సు మాటలు, మోసాలకు అడ్డూ అదుపు లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అని.. ఎన్నికల తరువాత రాష్ట్రాన్ని సంపూర్ణ మద్యపానప్రదేశ్​గా మార్చారని విమర్శించారు. మద్యపాన నిషేధం అనే ఊసు కూడా ఎత్తేది లేదంటూ రాసిచ్చి మరీ, మందు బాబుల్ని తాకట్టు పెట్టి రూ.8300 కోట్ల అప్పు తెచ్చారని మండిపడ్డారు. జగన్ బ్రాండ్లతో ఎన్ని వేల మంది మహిళల మెడలో తాళ్లు తెగబోతున్నాయో ఆలోచిస్తేనే భయం వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

loan with alcohol revenue guarantee: దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామని గొప్పలు పోయిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మద్యం రాబడినే హామీగా పెట్టి వేల కోట్ల అప్పులు చేస్తోంది. తాజాగా ఒకేసారి రూ.8,300 కోట్ల రుణం తెచ్చి.. మద్యనిషేధమనే మాటకు నిలువునా తూట్లు పొడిచింది. భవిష్యత్తులో మద్యనిషేధం విధించాలంటే ముందు ఈ అప్పులన్నీ తీర్చాలి. ఆర్థిక భారంతో అతలాకుతలమవుతున్న ప్రభుత్వం ఈ అప్పులు ఎప్పటికి తీరుస్తుంది.. మద్యనిషేధం ఎప్పటికి అమలు చేస్తుందన్నది అంతుచిక్కని ప్రశ్నే. ఇప్పటికే అప్పులకుప్పలా మారిన రాష్ట్రంపై మరో గుదిబండ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని చూపి తాజాగా రూ.8,300 కోట్ల రుణాన్ని సమీకరించింది. ప్రభుత్వ ఆదాయాన్ని ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించి, ఆ ఆదాయాన్ని ఎస్క్రో చేసి రుణాలు తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్న అంశం హైకోర్టు పరిధిలో ఉండగానే ఈ అప్పు తేవడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్దేశించిన రుణ పరిమితితో సంబంధం లేకుండా బయట నుంచి కార్పొరేషన్‌ పేరుతో అప్పు తీసుకోవడంపైనా అభ్యంతరాలు వినిపిస్తున్నాయి.

రాజ్యాంగ విరుద్ధ ప్రక్రియతో అప్పులా? :ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యంపై ప్రత్యేక మార్జిన్‌ విధించి, వసూలు చేసుకునేలా ప్రభుత్వం చట్టసవరణ చేసింది. ఇలా వసూలు చేసిన మొత్తం ఆ కార్పొరేషన్‌ ఆదాయమేననీ చట్టంలో పేర్కొంది. అంతకు ముందే ప్రభుత్వం మద్యంపై వ్యాట్‌ను తగ్గిస్తూ చట్ట సవరణ తెచ్చింది. ప్రభుత్వానికి వ్యాట్‌ రూపంలో వచ్చే ఆదాయాన్ని తగ్గించుకుని, బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక మార్జిన్‌గా వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించడం వివాదాస్పదమవుతోంది. తనకు ప్రత్యేక మార్జిన్‌ రూపంలో ఇంత ఆదాయం వస్తోందని చూపిస్తూ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ రుణాలు సమీకరిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని నిపుణులు పేర్కొంటున్నారు.

‘రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలులో కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితా అంశాలు ఉన్నాయి. ఆయా అంశాల్లో చట్టాలు చేసే అధికారం వాటికే ఉంది. రాష్ట్రంలో ఏ పన్నులైనా విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే. రాజ్యాంగంలోని 11వ షెడ్యూలు ఆర్టికల్‌ 243 (జి) 243 (హెచ్‌) ప్రకారం గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు కొన్ని పన్నులు విధించుకుని, వసూలు చేసుకోవచ్చు. కానీ కంపెనీ చట్టం కింద ఏర్పడ్డ కార్పొరేషన్లకు ఇలాంటి అధికారమే లేదు’ అని నిపుణులు పేర్కొంటున్నారు. మద్యంపై వసూలు చేసే పన్ను అయినా, మార్జిన్‌ అయినా ఖజానాకు చేరాక, అప్రాప్రియేషన్‌ బిల్లులో పొందుపరిచి.. అప్పుడు కార్పొరేషన్‌కు బదిలీ చేసే అధికారం ఉంటుంది. అంతేకానీ నేరుగా కార్పొరేషన్‌ వసూలు చేసుకుని ఆదాయంగా వినియోగించుకోవడానికి వీల్లేదని నిపుణులు వాదిస్తున్నారు. ఇదే వాదనతో ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేయగా సంబంధీకులందరికీ న్యాయస్థానం నోటీసులిచ్చింది. జూన్‌ 15న మళ్లీ ఈ అంశం విచారణకు రానుంది. ఈలోపే బెవరేజెస్‌ కార్పొరేషన్‌ అప్పులు తీసుకోవడం గమనార్హం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details