ప్రభుత్వం నవరత్నాలు అని చెబుతూ ప్రజల కళ్ళుగప్పి మాయచేస్తోంటే, వైకాపా నేతలు ఇసుక, మట్టి మొదలుకుని ఎర్రచందనం వరకు కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్టు దోచుకుంటున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. విశాఖ జిల్లా గొలుగొండ మండలంలో.. నర్సీపట్నం వైకాపా ఎమ్మెల్యే అనుచరులు అత్యంత విలువైన అలెగ్జాండరైట్ రంగురాళ్ల కోసం సాలికమల్లవరం రిజర్వ్ ఫారెస్ట్‌లో యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారని మండిపడ్డారు.
అటవీ సిబ్బందిని కూడా బెదిరిస్తున్నారంటే ఎంత బరితెగింపో అర్ధమవుతోందని విమర్శించారు. క్రూరంగా.. వైకాపా నేతల స్వార్థం కోసం చిన్నారులతో అడవుల్లో ప్రమాదకరమైన సొరంగాలు తవ్విస్తున్నారని, పిల్లలకు ఏమైనా జరిగితే బాధ్యులెవరని లోకేశ్ ప్రశ్నించారు. ఒకవైపు అక్రమ తవ్వకం, మరోవైపు మైనర్ల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారన్న లోకేశ్.. నేరాలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఫోటోలను నారా లోకేశ్ ట్విట్టర్‌కు జత చేశారు.