ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ కుల అసమతుల్యంపై చేసిన వ్యాఖ్యలకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జనాభా అసమతుల్యానికి, కుల అసమతుల్యానికి తేడా తెలియని వ్యక్తి సీఎం అయితే ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే కుల అసమతుల్యం కాదని తెలిసి కూడా...కుల విద్వేషం రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని విమర్శించారు. అందుకే జగన్ను ఫేక్ సీఎం అనేదని విమర్శించారు.
జగన్ ఒకే సామాజిక వర్గానికి 850 ముఖ్యమైన పోస్టులు కట్టబెట్టి బడుగు, బలహీన వర్గాలకు ముష్టి పడేసింది కుల అసమతుల్యమని దుయ్యబట్టారు. ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేసారా ? అని సీఎం జగన్ను నిలదీశారు. ఇంకెంత కాలం దరిద్రపు కుల రాజకీయం చేస్తారంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రసంగానికి సంబంధించిన వీడియోను ట్వీటర్లో పోస్ట్ చేశారు.