రాష్ట్రంలో ఏర్పాటైన కంపెనీలు సీఎం జగన్కు బైబై చెప్పేస్తున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. విధ్వంసం, వైకాపా నాయకుల బెదిరింపుల కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన వారు, కంపెనీలు ఏర్పాటు చేసినవారు భయంతో పారిపోతున్నారన్నారు. జగన్ మొహం చూసి ఒక్క కంపెనీ రాకపోగా..ఉన్న కంపెనీలు సైతం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని విమర్శించారు.
సీఎం జగన్ నిర్లక్ష్యధోరణి నిరుద్యోగులకు శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో పదిహేనేళ్ల క్రితం ఏర్పాటై.. 3 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన హెచ్ఎస్బీసీ కంపెనీ రాష్ట్రాన్ని విడిచిపెట్టిపోతుందన్నారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు.