పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం అనేక హింసాత్మక చర్యలకు పాల్పడుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జర్నలిస్టు వెంకట నారాయణ ఇంటిపై దాడే అందుకు ఉదాహరణ అన్నారు. పత్రికా స్వేచ్ఛని హరించేలా జగన్ రెడ్డి జీఓ తెచ్చారని...ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. వైకాపా నాయకుల అవినీతి, దందాలపై వార్త రాస్తే దాడులకు దిగుతున్నారని లోకేశ్ మండిపడ్డారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారా?: నారా లోకేశ్
జగన్ ప్రభుత్వంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రతికా స్వేచ్ఛను హరించేలా జీవో తెచ్చి...అనేక హింసాత్మక చర్యలకు పాల్పడుతోందని లోకేశ్ ఆరోపించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు జర్నలిస్ట్ వెంకట నారాయణ ఇంటిపై దాడి చేయటాన్ని లోకేశ్ తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టు ఇంటిని ధ్వంసం చేయడం చూసి షాక్‌కి గురయ్యానన్న లోకేశ్... ఆ గూండాలు కుటుంబాన్ని పెట్రోల్‌తో పోసి సజీవ దహనం చేస్తామని బెదిరించారన్నారు. ఓం ప్రతాప్ మరణం, వైకాపా ఇసుక మాఫియాను బహిర్గతం చేసినందుకు ఇది ప్రతీకార చర్యగా పేర్కొన్నారు. తమను తాము కాపాడుకునేందుకు భయంతో ఆ కుటుంబం ఇంటి లోపలికి వెళ్లి తాళం వేసుకుందన్నారు. అధికార పార్టీ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందనటానికి రుజువన్న ఆయన... ఇది చట్ట వ్యతిరేకమైన చర్య అని అన్నారు. దాడికి సంబంధించిన వీడియోను లోకేశ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాజకీయ జోక్యం లేకుండా నేరస్థులను శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:మాజీ మంత్రి అచ్చెన్నకు కరోనా నెగెటివ్