LOKESH ON EDUCATION SYSYTEM : విద్యాసంస్కరణల పేరుతో వైకాపా ప్రభుత్వం అమలు చేస్తోన్న 117 జీవో టీచర్లపై కక్ష సాధించేలా ఉందని.. విద్యార్థులకు శిక్షగా మారిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ విద్యా విధానం అమలు పేరుతో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, పాఠశాలల విలీనం కోసం సర్కారు జారీచేసిన జీవో 117, 128, 84, 85లతో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యలో 3వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మూడేళ్ల జగన్‌రెడ్డి పాలనలో 19వ స్థానానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. పాఠశాలల విలీనంతో నిరుపేద పిల్లలు విద్యకి పూర్తిగా దూరమై.. బాలకార్మికులుగా మారే ప్రమాదం ఉందన్నారు.
నూతన విద్యావిధానాన్ని.. ఉపాధ్యాయులపై కక్ష సాధించేందుకు జగన్ ప్రభుత్వం వాడుతోందని లోకేశ్ దుయ్యబట్టారు. వారానికి 24 నుంచి 30 పీరియడ్లు మాత్రమే చెప్పగలిగిన ఉపాధ్యాయులు.. వైకాపా తెచ్చిన జీవో ప్రకారం వారానికి 40 నుంచి 48 పీరియడ్లు పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. తలకు మించిన భారంగా పనిగంటలు పెంచి.. పైపెచ్చు 8 గంటలైనా ఉపాధ్యాయులు స్కూల్‌లో పనిచేయలేరా అని విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయులను వెటకరించడం ముమ్మాటికీ వేధింపుల్లో భాగమేనని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదంటూ టీచర్లని బెదిరించేలా మంత్రి మాట్లాడటం ప్రభుత్వం నిరంకుశ తీరుకి అద్దం పడుతోందన్నారు.