జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వ్యాప్తి కట్టడికి కొద్ది రోజులపాటు లాక్‌డౌన్ విధించాలని..... తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన ఆందోళనకు గురికావాల్సిన అవసరం ఏమీ లేదని కేసీఆర్ భరోసానిచ్చారు. అందరికీ సరైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నివారణ, బాధితులకు అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ఆదివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ విజృంభణపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రజల కదలికలు భారీగా పెరగడం..
జీహెచ్ఎంసీ పరిధిలో పరిస్థితిని మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. రాజధాని పరిధిలో మరోసారి 15 రోజులపాటు లాక్‌డౌన్ విధించాలని వైద్యాధికారులు, వైద్య నిపుణులు కోరుతున్నారని వెల్లడించారు. స్పందించిన సీఎం.. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న క్రమంలో ఇక్కడా అదే పరిస్థితి ఉండటం సహజమని చెప్పారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత.. ప్రజల కదలికలు భారీగా పెరగడంతో వైరస్ విస్తరణ ఎక్కువగా ఉందన్నారు.
ఇతర నగరాలు సైతం
చెన్నైలో మళ్లీ లాక్‌డౌన్ విధించారన్న కేసీఆర్.. ఇతర నగరాలు సైతం అదే దిశగా ఆలోచిస్తున్నాయని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో లాక్‌డౌన్ విధించాలంటే అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. లాక్‌డౌన్ విధిస్తే కట్టుదిట్టంగా, సంపూర్ణంగా అమలు చేయాలని చెప్పారు. నిత్యావసర సరకుల కొనుగోలుకు ఒకటి, రెండు గంటలు సడలింపు ఇచ్చి రోజంతా లాక్‌డౌన్ అమలుచేయాల్సి ఉంటుందన్నారు.