రాష్ట్రంలో దాదాపు రెండున్నర వేల బస్సులు... ప్రైవేటు రంగంలో ఉండగా.. వీటిపై ఆధారపడి 35వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కరోనా అలజడితో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. బస్సులు నడవకపోయినా.. పర్మిట్‌లు, పన్నులు, బ్యాంకు ఈఎంఐలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేయకపోతే.. బస్సులు నడపడం కష్టమంటున్నారు. టోల్ గేట్ల మినహాయంపు, పన్ను రాయితీ కల్పించాలని... కోరుతున్నారు.
ప్రైవేటు బస్సు యాజమాన్యాలనేకాదు.. వాటిని నమ్ముకున్న దాదాపు 20కిపైగా రంగాల వారినీ కరోనా దెబ్బతీసింది. డ్రైవర్లు, క్లీనర్లు, హెల్పర్లతోపాటు.. మెకానిక్‌లు, టింకరింగ్ పనిచేసే వాళ్లూ ......ఇలా చిన్నా చితక పనులతో కుటుంబాల్ని నెట్టుకొచ్చేవారి ఉపాధికీ గండి పడింది. ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆధారపడి... రాష్ట్రంలోని ప్రధాన రహదార్లు వెంట ఉండే అనేక గ్రామాల్లో టికెట్ బుకింగ్ ఏజెంట్లు ఉంటారు. ఒక్కో సీటు బుకింగ్ మీద వచ్చే కమిషన్లపైనే వీరు ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఇప్పుడు వారందరి ఆదాయాల్నీ కరోనా దెబ్బకొట్టింది.