ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లాక్​డౌన్​ ఎఫెక్ట్: అత్యవసరాలకు ఇబ్బంది - హైదరబాద్​లో లాక్ డౌన్ తాజా న్యూస్

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో అనధికారికంగా కర్ఫ్యూ అమలవుతున్నట్లు కనిపిస్తోంది. కరోనా పేరుచెప్పి కొందరు స్థానికులు రోడ్లను పూర్తిగా మూసేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు కాలనీల్లోకి వెళ్లకుండా కర్రలు అడ్డు పెడుతున్నారు.

లాక్​డౌన్​ ఎఫెక్ట్: అత్యవసరాలకు ఇబ్బంది
లాక్​డౌన్​ ఎఫెక్ట్: అత్యవసరాలకు ఇబ్బంది

By

Published : Apr 30, 2020, 4:51 PM IST

హైదరాబాద్​లో మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పోలీసులు మొదటి రోజు నుంచి ప్రధాన రహదారులను మూసేశారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను అధికారులే కంటెయిన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించి, ప్రజావసరాలను తీర్చారు. కేసులు తగ్గగానే జోన్లను ఎత్తేస్తూ వచ్చారు.

ఇది చూసి కొందరు కాలనీ వాసులు కరోనాతో సంబంధం లేకున్నా దారులు మూసేస్తున్నారు. ఇదేంటని అడిగితే.. 'దిక్కున్న చోట చెప్పుకో' అంటున్నారు. మాట్లాడితే దాడులు చేస్తున్నారు. ఫలితంగా కాలనీల్లో ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బందిపడుతున్నారు. కిరాణా దుకాణాలు మూతపడుతున్నాయి. సంచార రైతుబజార్లు, గ్యాస్‌ వాహనాలు రాలేకపోతున్నాయి. పోలీసుల ఉదాసీన వైఖరితోనే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ వీధుల్లో కర్రలు అడ్డుపెట్టడం వల్ల ఘర్షణ వాతావరణ నెలకొంటోంది.

ఆలకించండి.. అవస్థలు ఇవిగో..

* వివేకానందనగర్‌కాలనీ, ఏఎస్‌రాజునగర్‌, జలవాయువిహార్‌ కాలనీల రోడ్లు మూతపడ్డాయి. హెచ్‌ఎంటీ శాతవాహన, హెచ్‌ఎంటీహిల్స్‌, ఇంద్రానగర్‌ తదితర బస్తీవాసులు చుట్టూ కిలోమీటరుకుపైగా తిరిగి ఇంటికి చేరుకోవాల్సి వస్తోంది. కేపీహెచ్‌బీకాలనీ తొమ్మిదో ఫేజులోకి బయటివారు ప్రవేశించకుండా మూడు వైపులా రోడ్డును మూశారు. ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్‌ పరిధిలోని కొన్ని కాలనీలకు ప్రవేశమే లేకుండా పోయింది.

* ఖైతరాబాద్‌ ఆనంద్‌నగర్‌ కాలనీ నుంచి పక్కనే ఉన్న చింతబస్తీ మార్కెట్‌కు వెళ్లాలంటే కిలోమీటరున్న దూరం తిరిగాల్సి వస్తోంది.

* యూసఫ్‌గూడ పరిధిలోని మధురానగర్‌, ఇతరత్రా కాలనీల్లో కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్‌మెంట్లు రహదారులను మూసేశాయి.

* ముషీరాబాద్‌లో సాయిరెడ్డి వీధి, ఎంసీహెచ్‌కాలనీ, మోహన్‌నగర్‌, బ్రహ్మంగారి దేవాలయం వీధి, రాంనగర్‌ జెమినీ కాలనీ ప్రాంతాల్లో రోడ్లపై కర్రలు అడ్డుగా వేశారు.

* ఉప్పల్‌ డివిజన్‌ పరిధిలో శ్రీనగర్‌కాలనీ వీధుల్లో ముళ్ల కంచెలు వేశారు. దీంతో స్థానికుల మధ్య వివాదాలు రేగుతున్నాయి.

* మన్సూరాబాద్‌ డివిజన్‌ ఆర్టీసీ కాలనీలో ప్రధాన రోడ్డును మూసివేశారు. కాలనీ వాసులంతా వినాయక్‌నగర్‌, స్వాతి అపార్టుమెంట్‌ రోడ్లను వినియోగించారు. కొద్దిరోజల క్రితం వినాయక్‌నగర్‌ ముఖద్వారం వద్ద కాలనీ ప్రతినిధులు అడ్డుకట్ట వేశారు.

* చర్లపల్లి డివిజన్‌ ఇందిరాగృహకల్ప(ఐజీ) కాలనీకి ఉన్న రెండు ప్రధాన ద్వారాలలో ఒకదాన్ని కాలనీవాసులు మూసేశారు. ఇప్పుడు ఆర్‌ఎల్‌నగర్‌, సత్యనారాయణ కాలనీ, రాంపల్లి చౌరస్తా, నాగారం, చక్రీపురం వాసులు అదనంగా 5కి.మీ ప్రయాణించి కుషాయిగూడ చేరుకుంటున్నారు.

* మల్లాపూర్‌ డివిజన్‌లో నెహ్రూనగర్‌ బస్తీ, అశోక్‌నగర్‌, మర్రిగూడ, దుర్గానగర్‌, గోకుల్‌నగర్‌ కాలనీ రోడ్లపై టైర్లు, ఆటోలు పెట్టగా చెత్త తరలించే వాహనాలూ రావడం లేదు. గర్భిణీలు ఆస్పుత్రులకు వెళ్లేందుకు ఇబ్బందికరంగా మారింది.

* నిజాంపేట బాలాజీనగర్‌ కమాన్‌ రహదారిని బంద్‌ చేయగా ఆ కాలనీతో పాటు అవతల ఉన్న కేటీఆర్‌ కాలనీ వాసులు ఇబ్బందిపడుతున్నారు.

* ఆర్కేపురం డివిజన్‌లోని ఎన్టీఆర్‌కాలనీ ప్రాంతంలో వృద్ధులు, బ్యాంకు సేవలకు వెళ్లేవారు అవస్థలుపడుతున్నారు.

* జైకిసాన్‌కాలనీలో వీధులు బంద్‌ చేయగా స్థానికుల ఆందోళనతో తెరిచారు.

* ముసారాంబాగ్‌ డివిజన్‌ పీఅండ్‌టీ కాలనీలోనూ కర్రలు అడ్డుపెట్టారని మలక్‌పేట ఇన్‌స్పెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తే.. స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసుకోవడంతో అభ్యంతరం చెప్పలేదనడం గమనార్హం.

ఉదాహరణలివ్వండి.. ప్రభుత్వానికి పంపిస్తాం...

కొన్ని కాలనీల్లో మార్గాలను మూసివేయడం వల్ల పడుతున్న ఇబ్బందులు తమ దృష్టికి రాలేదని నగర పోలీస్​ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. ఇబ్బందులపై కొన్ని ఉదాహరణలు మా దృష్టికి తెస్తే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలుంటే పరిష్కారంపై దృష్టిపెడతామని సీపీ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

లాక్ డౌన్ తో వెతలు: ప్రాణం మీదకు తెస్తున్న కంచెలు

ABOUT THE AUTHOR

...view details