రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ ఉగ్రరూపం దాలుస్తోంది. వైరస్ ఒక్కరోజులోనే 43మందిని బలిగొంది. రెండ్రోజుల వ్యవధిలో ఏకంగా 80 మంది మృతి చెందారు. ఇంతకుముందెప్పుడూ ఇన్ని మరణాలు సంభవించలేదు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 10 మంది మరణించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 9 మంది... చిత్తూరు, తూర్పుగోదావరి, కడప జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. మహమ్మారి ధాటికి... ప్రకాశం జిల్లాలో ముగ్గురు, విశాఖలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించారు. మొత్తంగా రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 408కి చేరింది.
రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 19 వందల 16 మందికి పాజిటివ్ వచ్చింది. కొత్తకేసులతో బాధితుల సంఖ్య 33 వేల 19కి పెరిగింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 238 మందికి వైరస్ సోకింది. శ్రీకాకుళం జిల్లాలో 215, పశ్చిమగోదావరి జిల్లాలో 199 కేసులు బయటపడ్డాయి. అనంతపురం జిల్లాలో కొత్తగా 185 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరించారు. కర్నూలు జిల్లాలో 169, నెల్లూరు జిల్లాలో 165, తూర్పుగోదావరి జిల్లాలో 160 మందికి సోకింది. కొత్తగా 22 వేల మందికి పరీక్షలు నిర్వహించారు.
వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో...వ్యాపారులు, దుకాణదారులు స్వచ్ఛందంగా వాణిజ్యసముదాయాలు మూసివేస్తున్నారు. మరికొన్నిప్రాంతాల్లో అధికారుల ఆదేశాలతో లావాదేవీలకు విరామమిచ్చారు. రోజుకు 5 కోట్ల రూపాయల వ్యాపారం జరిగే విజయవాడ శివారులోని గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్‌ను... సోమవారం నుంచి తెరవట్లేదు. వన్‌టౌన్‌లోని మార్కెట్‌ను ఈనెల 9 నుంచే మూసిఉంచారు.